ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడమే కాకుండా.. చంద్రబాబు మరో పెద్ద తప్పు కూడా చేశారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ కార్యకలాపాలన్నీ తన చుట్టూరా తిరిగేలా చేసుకున్నారు. ఇది ఎంత తప్పో చంద్రబాబుకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది.
తనయుడు లోకేష్ కోసం ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఎదగకుండా చేశారు బాబు. ఆ నిర్ణయం ఇప్పుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి పెద్ద అడ్డంకిగా మారింది. లోకేష్ ను కొంతమంది సీనియర్లు పట్టించుకోవడం లేదు, మరికొంతమంది సీనియర్లను లోకేష్ పట్టించుకోవడం లేదు. దీంతో లోకేష్ కు ద్వితీయ శ్రేణి నాయకత్వ సమస్య ఎక్కువైంది. తనకంటూ ఓ టీమ్ లేకుండా పోయింది.
లోకేష్ ఆత్మన్యూనత..
వాస్తవంగా చంద్రబాబు సీనియర్లని దగ్గరకు తీస్తే.. యువనాయకత్వాన్ని లోకేష్ చేరదీయాల్సిన పరిస్థితి. కానీ లోకేష్ కి ఆత్మన్యూనత బాగా ఎక్కువ. తాను ఎమ్మెల్యేగా గెలవలేకపోయాననే బాధతో.. ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడిపై అక్కసు పెంచుకున్నారు.
పరిటాల శ్రీరామ్ సహా.. ఇతర యువనాయకులెవర్నీ లోకేష్ దగ్గరకు తీసింది కూడా లేదు. దీంతో అటు సీనియర్లు పట్టించుకోక, ఇటు జూనియర్లు దగ్గర లేక లోకేష్ కి ఓ వర్గమంటూ లేకుండా పోయింది. ఇప్పుడు లోకేష్ చుట్టూ ఉన్న జనాలు, కార్యకర్తలకు ఎక్కువ, పొలిటీషియన్లకు తక్కువ.
సోషల్ మీడియాతోనే సరి..
నేను జనంలో తిరుగుతా.. నువ్వు సోషల్ మీడియాలో పట్టు పెంచుకోమంటూ గతంలో చంద్రబాబు ఇచ్చిన సలహా.. ఇప్పుడు లోకేష్ కొంప ముంచింది. లోకేష్ కేవలం ట్విట్టర్ పక్షిగా మారిపోయారు. జనాల్లోకి రావడమే మరచిపోయారు.
ఒకవేళ వచ్చినా దానివల్ల పార్టీకి కానీ, లోకేష్ కి కానీ ప్రయోజనం ఉండడం లేదు. దీంతో మరోసారి లోకేష్ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు.
ఆవేశం శూన్యం..
లోకేష్ మాట్లలో ఆయాసం కనిపిస్తుందే కానీ ఆవేశం ఏమాత్రం లేదు. పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిన సమయంలో కూడా లోకేష్ స్పందన అంతంతమాత్రమే. కనీసం చంద్రబాబు 36గంటల దీక్ష అయినా చేశారు. లోకేష్ ఏం చేశారనేదే అసలు ప్రశ్న.
కనీసం ఆ దీక్షయినా లోకేష్ తో చేయించి, ఢిల్లీకి ఆయన్నే పంపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ చంద్రబాబు అన్నిటికీ తానేనంటున్నారు, అన్నీ తన తర్వాతేనంటున్నారు. ఇలా అన్ని విధాలుగా కొడుకు రాజకీయ భవిష్యత్తును చంద్రబాబే బలి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.