జ‌గ‌న్ మేన‌మామ‌కు మున్సిప‌ల్ ప‌రీక్ష‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి మున్సిప‌ల్ ప‌రీక్ష ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌మలాపురం పంచాయ‌తీని న‌గ‌ర పంచాయ‌తీగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ న‌గ‌ర పంచాయ‌తీలో 20 వార్డులున్నాయి. …

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి మున్సిప‌ల్ ప‌రీక్ష ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌మలాపురం పంచాయ‌తీని న‌గ‌ర పంచాయ‌తీగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ న‌గ‌ర పంచాయ‌తీలో 20 వార్డులున్నాయి. 

చైర్మ‌న్ పీఠాన్ని ఎస్సీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు. క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొద‌టి విడ‌త‌లో నిర్వ‌హించిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు, తాజాగా మిగిలి పోయిన వాటికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు ఎంతో తేడా వుంది. ఇప్పుడు ప్ర‌తిచోట పోటీపోటీగా నామినేష‌న్లు వేస్తున్నారు.

క‌మ‌లాపురంలో ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి బ‌లమంతా ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పుత్తా న‌ర‌సింహారెడ్డే. పుత్తా న‌ర‌సింహారెడ్డి దురుసుత‌నంతో పోల్చితే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి సౌమ్యుడిగా క‌నిపిస్తార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల అభిప్రాయం. ర‌వీంద్ర‌నాథ‌రెడ్డి నాయ‌క‌త్వంపై సొంత పార్టీలో కూడా సానుకూల‌త లేద‌నే చ‌ర్చ క‌డ‌ప‌లో ఉంది. అయితే ఆయ‌న ఏ ఒక్క‌రికీ హాని చేయ‌ర‌నే ఒకే ఒక్క స‌ద‌భిప్రాయ‌మే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించింద‌ని చెబుతున్నారు.

పోనీలే మ‌న‌కేం చేయ‌క‌పోయినా, క‌నీసం ద్రోహ‌మైనా చేయ‌రు కదా అని ఇంత కాలం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌మ‌కు తాము స‌ర్ది చెప్పుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏమీ ప‌ట్టించుకోన‌ట్టే … ఇప్పుడు కూడా అదే వైఖ‌రితో ఉండ‌డాన్ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌లాపురం న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌లను ఇరు పార్టీలు ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో ప‌ట్టు సాధించాల‌ని ఇరు పార్టీలు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇందులో భాగంగా అన్ని వార్డుల‌కు నామినేష‌న్లు వేయ‌గ‌లిగారు. అస‌లు ఏక‌గ్రీవ‌మ‌నే మాట‌కే తావు లేదు. క‌మ‌లాపురం న‌గ‌ర పంచాయ‌తీలో వైసీపీ, టీడీపీతో పాటు న‌లుగురు జనసేన అభ్యర్థులు, సీపీఐ త‌ర‌పున ఇద్ద‌రు, స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా ఏడుగురు నామినేష‌న్లు వేశారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌ర‌ణ‌కు మ‌రొక్క రోజు గ‌డువు వుంది. ఈ లోపు టీడీపీ అభ్య‌ర్థుల‌తో విత్‌డ్రా చేయించ‌కుండా పుత్తా న‌ర‌సింహారెడ్డి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.

ఎలాగైనా కొన్ని చోట్ల ఏక‌గ్రీవం చేసుకోవాల‌నే ఆలోచ‌న ర‌వీంద్ర‌నాథ‌రెడ్డిలో ఉన్న‌ప్పటికీ, అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. పుత్తా న‌ర‌సింహారెడ్డిని కాద‌ని రౌడీయిజం చేసే సీన్ జ‌గ‌న్ మేన‌మామ‌కు ఎంత మాత్రం లేదు. ఎంత సేపూ ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో వైసీపీ గెల‌వాల్సిన ప‌రిస్థితి క‌మ‌లాపురంలో నెల‌కుంది. 

క‌మ‌లాపురం న‌గ‌ర పంచాయ‌తీలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా …సీఎం చేతిలో ఏమ‌వుతుందో అంద‌రికంటే మేన‌మామ‌కే బాగా తెలుసు. అందుకే ర‌వీంద్ర‌నాథ‌రెడ్డికి క‌మ‌లాపురం విజ‌యం ఓ పెద్ద స‌వాల్‌గా నిలిచింది. చూద్దాం ఏమ‌వుతుందో!