రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి కొన్ని పరిణామాలు అనూహ్యంగా కలిసొస్తాయి. మరికొన్ని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తాయి. ఎంతటి వారికైనా సొంత నియోజకవర్గంలో పట్టు వుంటేనే ఎన్ని ఆటలైనా ఆడొచ్చు. పునాదులే బలహీన పడితే? ఇక చెప్పేదేముంది? భవిష్యత్ అంధకారమే. అందుకే చంద్రబాబును కుప్పం ఎన్నిక మునుపెన్నడూ లేని విధంగా భయపెడుతోంది.
1989 ఎన్నికల్లో మొదటిసారిగా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబునాయుడు గెలుపొందారు. ఇప్పటి వరకూ ఆయన అక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. కుప్పం ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారు. కేవలం ఒక్కసారి మాత్రం తన స్వస్థలమైన చంద్రగిరి నుంచి చంద్రబాబు గెలుపొందారు.
చంద్రగిరిని నమ్ముకుంటే రాజకీయంగా శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందని…1983 ఓటమి ఆయనకు హెచ్చరిక చేసింది. దీంతో చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని సురక్షిత నియోజక వర్గంగా ఎంచుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయ పునాదులు కదులుతున్నాయి.
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రిలా ప్రత్యర్థుల విషయంలో చూసీచూడనట్టు పోయే రకం కాదు. ప్రత్యర్థి అంతు తేల్చే వరకూ నిద్రపోరనే పేరు జగన్‌కు ఉంది. ఇదే చంద్రబాబు పాలిట శాపమైంది. 2019లో చంద్రగిరి నుంచి చంద్రబాబు 31 వేల మెజార్టీతో గెలుపొందారు.
గట్టిగా కృషి చేస్తే చంద్రబాబును కుప్పంలో కట్టడి చేయొచ్చనే నమ్మకాన్ని, భరోసాను 31వేల మెజార్టీ కలిగించింది. దీంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అనూహ్య విజయాల్ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇలాంటి ఫలితాలను టీడీపీ కలలో కూడా ఊహించలేదు. దీంతో తన రాజకీయ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందని చంద్రబాబు భయాందోళనకు గురయ్యారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాక మునుపే ఆయన అక్కడ రెండు రోజులు ప్రచారం నిర్వహించారు.
అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, ఇతరత్రా విషయాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 39 వేల పైచిలుకు ఓట్లు వుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు 10 వేల మెజార్టీ వచ్చింది. ఐదు వేల ఓట్లను తమ వైపు తిప్పుకుంటే చాలు టీడీపీని మట్టి కరిపించొచ్చని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
కుప్పంలో టీడీపీ ఓడితే మాత్రం ఇక చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, కుప్పంలో చంద్రబాబు గెలుపుపైనే అనుమానం ఉన్నప్పుడు, ఆయన ఇతర నియోజకవర్గాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. అంటే చంద్రబాబునాయుడిని ఆయన నియోజకవర్గానికే కట్టడి చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో సగం విజయం సాధించినట్టు అవుతుందని వైసీపీ ఆలోచన. అందులో భాగంగానే టీడీపీకి కంచుకోటైన కుప్పం మున్సిపాలిటీలో ఆ పార్టీని చావు దెబ్బతీయాలని వైసీపీ పట్టుదలగా ఉంది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నేతృత్వంలో వైసీపీ టీం కుప్పంలో ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తులేస్తూ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
ఇదే సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఆ పార్టీ వైసీపీకి స్థానం కల్పించకుండా ఉండేందుకు పకడ్బండీ వ్యూహాలను రచిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించడం అంత సులభం కాదని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఆటలో చివరికి గెలుపు ఎవరినో వరిస్తుం దోనన్న ఉత్కంఠ నెలకుంది.