జనసేనాని పవన్‌కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కు ఆయన అన్న, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. ఇందులో పవన్ కల్యాణ్ రాజకీయ పంథాను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ట్వీట్ చెప్పినట్టు చర్చ జరుగుతోంది. చిరంజీవి ట్వీట్ ఏంటో చూద్దాం.
“జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు!”
తన తమ్ముడు పవన్ జనాల హృదయాన్ని గెలిచిన నాయకుడిగా చిరంజీవి అభివర్ణించారు. రాజకీయంగా పవన్‌కల్యాణ్ ఆశయాలు సిద్ధించాలని అన్నగా ఆశీస్సులు కూడా అందించారు. అంతేనా, పవన్ లాంటి వ్యక్తి తనకు తమ్ముడైనందుకు గర్వంగా వుందని పేర్కొనడం విశేషం. ఆ మధ్య సినిమా వేడుకలో పవన్‌కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతైనా పవన్ తన తమ్ముడని చెప్పిన సంగతి తెలిసిందే.
పవన్‌ను ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్నట్టు చిరంజీవి చెప్పారు. అయితే పవన్‌కల్యాణ్‌కు తన అన్న అనుకుంటున్నట్టు గొప్ప ఆశలు, ఆశయాలు కనిపించడం లేదు. పవన్‌కు ఉన్న ఏకైక ఆశయం… సీఎం గద్దె మీద నుంచి జగన్‌ను దించడమే. ఇదే తన జీవితాయశంగా పవన్ చాటుకుంటున్నారు. వారాహి యాత్ర చేస్తున్న పవన్‌కల్యాణ్ పదేపదే జగన్‌పై విమర్శలు తప్ప, తనకు అధికారం ఇవ్వాలనే ఊసే లేదు. కానీ తమ్ముడిపై ప్రేమ చిరంజీవితో చాలా మాటలే మాట్లాడించింది. పవన్‌ను సీఎంగా చూడాలని చిరంజీవి కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అసలైన వ్యక్తికే ఆ కోరిక లేదనేదే ప్రశ్న.