వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రికి ఇడుపులపాయలో వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనంపై ఆమె స్పందించారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించాలన్న తన నిర్ణయాన్ని తప్పు పడుతున్న సొంత మనుషులకు ఆమె సమాధానం ఇవ్వడం విశేషం.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనే కాదు, ప్రతి రాజకీయ పార్టీపై వుందన్నారు. ఈ దిశగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ జరిగిందని ఆమె తెలిపారు. ఎలా కలిసి పనిచేస్తే కేసీఆర్ అవినీతి పాలన అంతమవు తుందనే విషయమై సుదీర్ఘంగా చర్చించామన్నారు. చర్చలు తుది దశకు వచ్చాయన్నారు. చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి అందరికీ చెబుతామన్నారు.
తన వాళ్లే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ బిడ్డ ఒక విషయం చెప్పాలని అనుకుంటోందన్నారు. రాజకీయం అంటే వండినట్టు, తిన్నట్టు కాదన్నారు. చిత్తశుద్ధితో పాటు ముందు చూపు, గుండె నిబ్బరం వుండాలన్నారు. అంతేకాదు, ఓపిక కూడా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది సోనియాగాంధీ అని, అలాంటప్పుడు వాళ్లతో కలిసి ఎలా పని చేస్తారని తన వాళ్లే ప్రశ్నించారన్నారు.
వైఎస్సార్ ఆత్మసాక్షిగా ఆయన బిడ్డ నిజం చెబుతోందన్నారు. ఎఫ్ఐఆర్‌లో తన తండ్రి పేరు చేర్చడంపై సోనియా, రాహుల్‌గాంధీ వద్ద ప్రస్తావించానన్నారు. ఇందుకు వారు చెప్పిన సమాధానం… రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత సీబీఐ చార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చారని, ఆ బాధ ఎలా వుంటుందో తనకు తెలుసని సోనియాగాంధీ చెప్పారని షర్మిల తెలిపారు. తమకు తెలిసి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంత ద్రోహం ఎప్పటికీ చేయమని తనతో చెప్పారని ఆమె వెల్లడించారు. వైఎస్సార్‌ను ఆ విధంగా అవమానించామంటే మీరు ఎలా నమ్మారని సోనియా, రాహుల్ ప్రశ్నించినట్టు షర్మిల చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌పై తమకు అపారమైన గౌరవం వుందని తనకు చెప్పినట్టు ఆమె వెల్లడించారు. వైఎస్సార్ లేని లోటు ఈ రోజుకు తమకు ఉందని తన తండ్రిని సోనియా, రాహుల్ ఆకాశానికెత్తారన్నారు. తన తండ్రి పేరు ఎఫ్ఐఆర్‌లో చోటు చేసుకోవడం అనేది వారికి తెలియక జరిగిన పొరపాటే తప్ప, తెలిసిన తప్పు కాదని షర్మిల తేల్చి చెప్పారు. వైఎస్సార్‌పై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి అపారమైన గౌరవం వుందని తాను నిర్ధారించుకున్న తర్వాతే అభిమానులకు హామీ ఇస్తున్నట్టు షర్మిల తెలిపారు.