బి సి కాలం నాటి బాబు టీమ్ వ్యూహం?

భలే నవ్వు వస్తోంది ఈ విశ్లేషణ చూసి. Advertisement ఏదో విధంగా మోడీకి జగన్ ను దూరం చేయాలి. ఆపై చంద్రబాబుకు దగ్గర చేయాలి ఇదే కదా.. తెలుగు నాట ఓ సెక్షన్ మీడియా…

భలే నవ్వు వస్తోంది ఈ విశ్లేషణ చూసి.

ఏదో విధంగా మోడీకి జగన్ ను దూరం చేయాలి. ఆపై చంద్రబాబుకు దగ్గర చేయాలి ఇదే కదా.. తెలుగు నాట ఓ సెక్షన్ మీడియా తహ తహ. ఇందుకోసం ఎన్ని ఎత్తులు ఎత్తాలో ఎత్తుతూనే వున్నారుా. తాజాగా వేసిన ఓ ఎత్తు చూసి భలే నవ్వు వస్తోంది. ఏనాటి వ్యూహం ఇది. జమానా కాలంలో వుండేవి ఇలాంటి ఎత్తుగడలు. ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు అని గమనించాలి.

ముత్యాల ముగ్గు సినిమాలో హీరోకి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలన్నది విలన్ ఆలోచన. అందుకోసం ఓ కాంట్రాక్టర్ ను పట్టుకుంటే వాడేం చేస్తాడు. ముందు హీరోకి.. హీరోయిన్ కు విడాకులు ఇప్పించాలి అంటాడు. అలా హీరో హీరోయిన్లను విడగొట్టాలి అంటే హీరోయిన్ మీద హీరోకి అపనమ్మకం కలిగించాలి. శీలం మీద అనుమానం పుట్టించాలి.

సరిగ్గా ఇదే తరహా ఎత్తుగడ పన్ని వార్తలు వండి వారుస్తున్నారు.

ఎన్నికల తరువాత అవసరం అయితే మీకు సహకరిస్తాను అని కాంగ్రెస్ కు జగన్ కబురు చేసారట. అందుకే కాంగ్రెస్ అర్జంట్ గా వ్యూహం మార్చుకుందట. షర్మిలను ఆంధ్ర పంపడం లేదట. రాహుల్ వైఖరి జగన్ కు సానుకూలంగా మారిందట.

ఇదీ వ్యూహాత్మకంగా జల్లిన బురద.

మొన్నటి దాకా షర్మిలను ఆంధ్రకు పంపుతున్నారు. ఇక జగన్ పనైపోయింది అని టముకు వేసింది ఇదే మీడియా.

ఇప్పుడు జగన్-కాంగ్రెస్ తో మిలాఖత్ అయిపోయారు అని చెబుతున్నదీ ఇదే మీడియా.

మొన్నటికి మొన్న నడ్డాతో కలయికకు అంతా రెడీ అయిపోయిందనే సూచనలు జనంలోకి పంపడానికి ‘ఫొటో’ గిమ్మిక్కు వాడారు. అది కాస్తా బయటకు వచ్చి అభాసు అయిపోయింది. భాజపాకు దగ్గర కావడానికి చంద్రబాబు ఆత్రం అర్థం అయిపోయింది.

ఇప్పుడు ఇలా కాదు జగన్ వుంటే బాబు అవసరం భాజపాకు రాదు. అందువల్ల జగన్ ను ముందు దూరం చేసేయాలని ఈ పన్నాగం మొదలెట్టారు అన్న మాట.

జైల్లో వుండడానికి సిద్దపడి మరీ సోనియాను ఢీ కొట్టిన జగన్ ఇప్పుడు అటు ఎందుకు వెళ్తారు.

మోడీ ప్రభుత్వమే మళ్లీ రాబోతోందని క్లియర్ ఇండికేషన్లు వున్నాయని తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తారు.

నిజానికి షర్మిల ఆంధ్ర రావడానికి ఏనాడూ సిద్దంగా లేరు. అన్నతో బహిరంగ పేచీ పెట్టుకునేంత కుసంస్కారి కాదు షర్మిల. ఇంటర్వూ ఇచ్చినపుడు కూడా ఎంత కిందా మీదా పడినా అన్నకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ తో భేటీ తరువాత కూడా షర్మిల టార్గెట్ తెలంగాణ అని అర్థం అయిపోయింది.

మరి ఇంకేం చేయాలి. ఈ పాయింట్లు అన్నీ కలిపి ఓ కథ అల్లాలి. ఆ కథ తాము గతంలో రాసిన వార్తల పరువు కాపాడాలి. ఆపై మోడీకి జగన్ కు మధ్య విడాకులకు దారి తీయాలి. ఆపై బాబుకు-భాజపాకు మళ్లీ మరోసారి ముడివేసి, పెళ్లి చేయాలి.

అలా చేయాలంటే ఇలాంటి కథనాలు వండి వార్చాలి.

అందుకే జగన్ ఒకేసారి మోడీతో కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడని, కాంగ్రెస్ కోటరీలోకి ఎంటర్ అయ్యాడని, ఇలాంటివి రాసి మోడీకి ఆగ్రహం తెప్పించాలి.

మోడీకి జగన్ మీద ఆగ్రహం రాకపోతే, ముందుగా చంద్రబాబు ఇన్ కమ్ టాక్స్ కేసు బలంగా మారిపోతుందేమో.. అదో పెద్ద భయం కూడా దీని వెనుక వుండే వుంటుంది.

ఊరక వ్యాసాలు వండి వార్చరు మహానుభావులు.