టాలీవుడ్ కు ప్రమాద హెచ్చరిక!

కరోనా తరువాత మన హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు ఆదాయం బాగా రావడంతో, హీరోలు తమ రెమ్యూనిరేషన్లు తమ చిత్తానికి పెంచేసారు. పాన్ ఇండియా అనే పదం ఒకటి…

కరోనా తరువాత మన హీరోల రెమ్యూనిరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు ఆదాయం బాగా రావడంతో, హీరోలు తమ రెమ్యూనిరేషన్లు తమ చిత్తానికి పెంచేసారు. పాన్ ఇండియా అనే పదం ఒకటి కొత్తగా పుట్టుకురావడం కూడా వీరికి కలిసి వచ్చింది. ఒకప్పుడు నాలుగు అయిదు కోట్లు తీసుకునే హీరోలు ఇప్పుడు పదమూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు పది కోట్లు తీసుకునే హీరోలు ఇరవైలు దాటేసారు. టాప్ హీరోలు అయితే 75 నుంచి 100 కు చేరిపోయారు. నిర్మాతలకు కూడా పోటీలు పడి, సినిమాలు ప్లాన్ చేసి, అడిగినంతా ఇస్తూ వచ్చారు.

ఇకపై ఈ తరహా వ్యవహారం చెల్లకపోవచ్చు. ఎందుకంటే హిందీ డిజిటల్ మార్కెట్ నిలువునా పడిపోతోంది. ఒక్క నెలలో మొత్తం తేడా వచ్చేసింది. హిందీ డిజిటల్ హక్కులు ఢమాల్ మన్నాయి. విడుదలకు సిద్దమవుతున్న చాలా సినిమాలు ఇప్పుడు తల పట్టుకుంటున్నాయి. హిందీ డిజిటల్ హక్కులు తీసుకుంటామని చెప్పిన సంస్థలు ఇప్పుడు తమకు అవసరం లేదని, కొనలేమని మెయిల్స్ పెడుతున్నాయి.

ఒకప్పుడు హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అంటే మన వాళ్లకు భలే ఆసక్తిగా వుండేది. ఆ రైట్స్ హాట్ కేక్ ల్లా అమ్ముడుపోయేవి. సినిమా అనౌన్స్ చేయగానే అమ్ముడు అయిపోయేవి. పైగా ఈ రైట్స్ మొత్తాలు చూపించే హీరోలు తమ రెమ్యూనిరేషన్లు ముక్కుపిండి వసూలు చేసేవారు. ఒక్క నిర్మాత కు కూడా రూపాయి లాభం ఇవ్వని ఓ హీరో అయితే కేవలం ఈ హిందీ మార్కెట్ చూపించే తొమ్మిది కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ లాగే వారు. కెరీర్ లో పట్టుమని రెండు మూడు హిట్ లు లేని మరో మాస్ హీరో ఈ హిందీ రైట్స్ చూపించే సినిమాలు సంపాదించేవారు. ఈ హిందీ హక్కుల కోసమే ఫైట్లు చొప్పించేవారు.

అలాంటిది ఇప్పుడు ఓటిటి సంస్థలు తమకు హిందీ డిజిటల్ రైట్స్ అవసరం లేదని కరఖండీగా చెప్పేస్తున్నాయి. చెప్పేసాయి కూడా. దాంతో నిర్మాతలు ముంబాయిలోని వ్యక్తిగతంగా హక్కులు కొనే వాళ్ల వెంట పడుతున్నారు. ఈ ఓటిటి సంస్థల దన్ను చూసుకుని ఇన్నాళ్లూ వాళ్ల ఫోన్ లు ఎత్తడం మానేసారు. ఇప్పుడు నిర్మాతలు ఫోన్ చేస్తుంటే వాళ్లు ఎత్డడం లేదు.

ఓడలు బండ్లు కావడం అంటే ఇదే. కేవలం సౌత్ డిజిటల్ రైట్స్ మాత్రమే కొనడం వల్ల ఓటిటి ఆదాయం తగ్గిపోతుంది. మరోపక్క తెలుగు శాటిలైట్ హక్కులు ఎలా అయితే తగ్గిపోయాయో, హిందీ శాటిలైట్ హక్కులు కూడా తగ్గిపోయాయి. అవి కూడా పెద్ద మొత్తాలు ఇవ్వడంలేదు.

నాని నటిస్తున్న ఓ సినిమాకు ఓటిటి సంస్థ తమకు హిందీ డిజిటల్ హక్కులు వద్దని మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఓ సీనియర్ హీరో నటించే సినిమాకు కూడా ఇదే సమస్య, చేతిలో బోలెడు సినిమాలు పెట్టేసుకున్న ఓ సంస్థ నిర్మాత ఇప్పుడు తమ సినిమాల హిందీ డిజిటల్ రైట్స్ కొనే వాళ్ల కవసం ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తున్నారు.

రాను రాను ఈ నాన్ థియేటర్ ఆదాయాలు ఇంకా తగ్గిపోతాయని, సమస్య ఇంకా జటిలం అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కనీసం అప్పుడైనా హీరోలు దిగి వస్తారో.. ఇంకా 20 కోట్లు, ముఫై కోట్లు, 70 కోట్లు అంటూనే వుంటారో?