తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని చంపింది ఎవరనే విషయం తేలిపోయింది. సొంత చెల్లెలు దీప్తి ప్రాణాలు తీసింది. ఈ నేరాన్ని దీప్తి చెల్లెలు చందన అంగీకరించింది. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టయింది.
ఇంతకీ ఏం జరిగింది..
కోరుట్లలో నివాసం ఉండే శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తోంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది.
ఓ ఫంక్షన్ కోసం తల్లితండ్రులు హైదరాబాద్ వెళ్లగా, మరుసటి రోజు ఉదయం దీప్తి సోఫాలో శవమై కనిపించింది. ఇంట్లో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అదే రోజు ఉదయం 5 గంటల సమయంలో చిన్న కూతురు చందన, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయింది. ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోతున్న దృశ్యాలు బస్టాండ్ సీసీటీవీ ఫూటేజ్ లో కనిపించింది.
దీంతో చెల్లెలే అక్కను హత్య చేసి ఉంటుందని అంతా భావించారు. అయితే అదే రోజు సాయంత్రం చందన, తన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పెట్టింది. తను అక్కను చంపలేదని, అందులో చెప్పుకొచ్చింది. అమ్మా-నాన్న ఇంట్లో లేకపోవడంతో మద్యం సేవిద్దామని అక్క తనతో చెప్పిందని, అప్పుడు తన ఫ్రెండ్ (ప్రియుడు) సహాయంతో మద్యం తెప్పించానని వాయిస్ మెసేజ్ లో చెప్పింది. అక్క మద్యం సేవించి తన బాయ్ ఫ్రెండ్ ను పిలుస్తానందంట. చందన మాత్రం వద్దని వారించిందట. ఆ తర్వాత అక్క తాగి సోఫాలో పడిపోవడంతో, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బాయ్ ఫ్రెండ్ తో కలిసి తను వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది చందన.
అయితే జరిగింది ఇంకోటి..
కేసు నమోదు చేసిన పోలీసులు, చందన వెంట పడ్డారు. ఆ రాత్రి ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకుంటే తప్ప అసలు మేటర్ బయటకు రాదని నిర్థారణకొచ్చారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చందనతో పాటు, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అసలు మేటర్ బయటపడింది.
దీప్తి, ఉమర్ షేక్ సుల్తాన్ ను ప్రేమించింది. అతడితో కలిసి పారిపోయేందుకు పథకం వేసింది. ప్లాన్ ప్రకారం దీప్తికి మద్యం తాగించింది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. బీరువాలో నగలు, నగదు సర్దడం మొదలుపెట్టారు. అదే టైమ్ లో దీప్తికి మెళకుల వచ్చి కేకలు వేసింది.
దీంతో ఆమెను నిలువరించేందుకు చున్నీతో కట్టేశారు. అయినప్పటికీ దీప్తి అరవడం ఆపకపోవడంతో.. ఆమె ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేశారు. దీంతో దీప్తి అపస్మారక స్థితికి చేరుకొని ఆ తర్వాత మృతి చెందింది. మొత్తం సర్దుకున్న తర్వాత దీప్తికి వేసిన ప్లాస్టర్లు తీసేసి.. చందన-ఉమర్ అక్కడ్నుంచి జారుకున్నారు. అయితే పోలీసులు వలపన్ని ఇద్దర్నీ పట్టుకున్నారు.
24 గంటల్లో ఈ కేసును జగిత్యాల పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ భాస్కర్, ఈ కేసు మొత్తం వివరాల్ని మీడియాకు వెల్లడించారు. తన ప్రేమ కోసం, ఆస్తి కోసం సొంత అక్కనే చందన దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది.