సమ్మె పరిష్కరిస్తే కేసీఆర్‌కు అవమానమా?

రేపేం జరుగుతుందో తెలియదు. ఏమిటిది? ఏదైనా తత్వబోధనకు సంబంధించిన విషయమా? కాదండి…రేపు టీఎస్‌ఆర్‌టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు విచారణ ఉంది. బహుశా కోర్టు దీనిపై తీర్పు కూడా ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. పదకొండో తేదీలోగా సమ్మె…

రేపేం జరుగుతుందో తెలియదు. ఏమిటిది? ఏదైనా తత్వబోధనకు సంబంధించిన విషయమా? కాదండి…రేపు టీఎస్‌ఆర్‌టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు విచారణ ఉంది. బహుశా కోర్టు దీనిపై తీర్పు కూడా ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. పదకొండో తేదీలోగా సమ్మె పరిష్కారం కాకపోతే తామే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు సర్కారును హెచ్చరించింది కూడా. అయినా ఇప్పటివరకు ఏమీ కాలేదు. కాని ట్యాంక్‌బండ్‌ రణరంగంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో జరిగిన మిలియన్‌ మార్చ్‌ను గుర్తుకు తెచ్చింది. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెలో ఇదో కీలక ఘట్టంగా నిలిచింది. దీంతో ఇప్పటివరకు జరిగిన ఆర్‌టీసీ సమ్మెల్లో దీనికో ప్రత్యేకత ఏర్పడింది. ఏ కోణంలో చూసినా గతంలో జరిగిన సమ్మెలకు, ఈ సమ్మెకు చాలా తేడా ఉంది. 

ఇంత సుదీర్ఘమైన సమ్మె  ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. తెలంగాణ సిద్ధించగానే రాష్ట్రాన్ని సమ్మెలు లేని తెలంగాణగా చేస్తానన్నారు కేసీఆర్‌. అంటే ఎవ్వరికీ కూడా సమ్మె చేసే ఛాన్స్‌ లేకుండా సమస్యలు పరిష్కరిస్తానని  ఆనాడు చెప్పారన్న మాట. కాని వాస్తవం మరోలా ఉంది. ఆర్‌టీసీ కార్మికుల కాలిలో ముల్లు దిగితే తన పంటితో తీస్తానన్నారు. కాని ట్యాంక్‌బండ్‌ రణరంగం…రక్తసిక్తమైంది. ఆర్‌టీసీ సమ్మె మొదలయ్యాక హైకోర్టు అనేకసార్లు ప్రభుత్వానికి విపరీతంగా చీవాట్లు వేసింది. ఇంత ఎక్కువగా చీవాట్లు తిన్న గతంలో జరిగి ఉండదు. అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని హైకోర్టు మండిపడటంతో సర్కారు ఓ దొంగగా మిగిలిపోయింది. 

ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి (కేసీఆర్‌కు) రాజధర్మం గురించి బోధ చేశారు. రాటుదేలిన రాజకీయ నాయకుడు, అపర చాణక్యుడైన కేసీఆర్‌ ఇలా పాఠాలు చెప్పించుకోవడం విచారకరమే. అయినా ఆయనలో మార్పు రావడంలేదు. ఏదోవిధంగా సమ్మె పరిష్కరించి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన ముఖ్యమంత్రి ఆర్‌టీసీ కార్మికుల పీచమణచడానికి ఇంకా మార్గాలు అన్వేషిష్తూనే ఉన్నారు. ముఖ్యంగా రూట్ల ప్రైవేటీకరణను హైకోర్టు అడ్డుకోవడంతో కేసీఆర్‌ కుతకుతలాడుతున్నారు. ఇలాంటి అడ్డంకులు లేకుండా, న్యాయస్థానానికి దొరికిపోకుండా ఇంకా ఏం మార్గాలున్నాయా? అని సమాలోచనలు చేస్తున్నారు. 'లీజు విధానం' గురించి ఆలోచిస్తున్నారని సమాచారం. దీన్ని ఎవరూ ప్రశ్నించలేరని అనుకుంటున్నారట. ఇది కూడా ప్రయివేటీకరణే. దీని అమలులో అడ్డంకులు రావని ఆయన అనుకుంటున్నారట…! 

ముందు కోర్టు గొడవ వదిలితే దాన్నిబట్టి ఆయన ఆలోచనలు సాగుతాయి. ఆర్‌టీసీ విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని భావిస్తున్నారు. ఓ పక్క హైకోర్టు విచారణ జరుపుతుండగానే, మరోపక్క టీఎస్‌ఆర్‌టీసీకి 'చట్టబద్ధత' లేదని కేంద్రం బాంబు పేల్చింది. ఎందుకంటే ఆర్‌టీసీ విభజన కాలేదు కాబట్టి. పేరుకు టీఎస్‌ఆర్‌టీసీ ఉన్నా చట్టబద్ధంగా ఉన్నది ఏపీఎస్‌ఆర్‌టీసీ ఒక్కటేనని కేంద్రం చెప్పింది. టీఎస్‌ఆర్‌టీసీని గుర్తించడంలేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఇది కేసీఆర్‌కు అర్థం కాలేదు. చట్టబద్ధత లేకుండా ఇన్నేళ్లుగా ఆర్‌టీసీ ఎలా నడుస్తోంది? అని ప్రశ్నించారు సీఎం. హైకోర్టుకు అధికారులు తప్పుడు లెక్కలు సమర్పించలేదని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నారు. 

కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపినా వారు సమ్మెకే మొగ్గు చూపారని ఆయన అంటున్నారు. చేయాల్సిందంతా చేశామని ఇక చేయాల్సింది ఏమీ లేదని రేపు హైకోర్టు విచారణ నేపథ్యంలో జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. రేపు కోర్టు ఏం చెబుతుందో విన్నాక తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే సుప్రీం కోర్టుకు పోతామని చెబుతున్నారు. ఒకవేళ సుప్రీం కోర్టుకు వెళ్లే పరిస్థితి వస్తే ఈ సమ్మెకు ముగింపు ఇప్పట్లో ఉండదు. ఈమధ్య కేసీఆరే ఈ మాటన్నారు. డిమాండ్లు పరిష్కరించకుండా (కొన్నైనా) సమ్మె విరమిస్తే ఆర్‌టీసీ యూనియన్లకు అవమానకరంగా ఉంటుంది. సుదీర్ఘ సమ్మె వృథా అవుతుంది. కార్మికులు యూనియన్‌ నాయకులపై తిరగబడవచ్చు. 'పులి మీద స్వారీ చేస్తున్నం. ఇప్పుడు దిగితే అది మింగేస్తది' అని జేపీసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి  అన్నారు.

కార్మికులను బెదిరించి, హెచ్చరించి, వార్నింగులు ఇచ్చి, డెడ్‌లైన్లు పెట్టాక ఇప్పుడు డిమాండ్లు పరిష్కరిస్తే ప్రభుత్వం లొంగిపోయినట్లవుతుందని, అవమానకరంగా (వ్యక్తిగతంగా కేసీఆర్‌కు) ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తాను పురుగుల్లా తీసిపారేసే ప్రతిపక్షాలు సమ్మెలో కీలకపాత్ర పోషిస్తుండటం కేసీఆర్‌కు మింగుడు పడటంలేదు. డిమాండ్లు పరిష్కరిస్తే దాన్ని ప్రతిపక్షాలు తమ విజయంగా ప్రచారం చేసుకుంటాయి. ఇది సీఎం ఏమాత్రం సహించలేరు. రెండు వర్గాల పంతాలు పట్టుదలల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ప్రతిష్టంభనకు సుప్రీం కోర్టే పరిష్కారం చూపిస్తుందా?