అక్షయ్ కుమార్ కు రైతుల సెగ..!

ఉరుము ఉరిమి సినిమా హీరోలపై పడింది. అసలే కరోనా కష్టాలతో సినిమాలు బాక్సుల్లో మగ్గిపోతున్నాయని బాధపడుతున్నారు స్టార్ హీరోలు. ఓటీటీలకు ఇచ్చేస్తే పరువు తక్కువ అని భావించి ఇన్నాళ్లు థియేటర్లలో విడుదల కోసం వేచి…

ఉరుము ఉరిమి సినిమా హీరోలపై పడింది. అసలే కరోనా కష్టాలతో సినిమాలు బాక్సుల్లో మగ్గిపోతున్నాయని బాధపడుతున్నారు స్టార్ హీరోలు. ఓటీటీలకు ఇచ్చేస్తే పరువు తక్కువ అని భావించి ఇన్నాళ్లు థియేటర్లలో విడుదల కోసం వేచి చూశారు. తీరా టైమ్ వచ్చే సరికి సవాలక్ష తలనొప్పులు. 

మొదట్లో 50 శాతం ఆక్యుపెన్సీ అనే సరికి ఆదాయం కూడా సగానికి సగం కోసుకు పోతుందని చాలామంది వెనకడుగేశారు. పరిస్థితులు కాస్త సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు అక్షయ్ కుమార్ తన సూర్యవంశి అనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే.. అక్కడికి రైతులు వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టారు. సినిమా ప్రదర్శనని అడ్డుకున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలొచ్చినా వారు మాత్రం ఉద్యమాన్ని ఆపలేదు. ఈ క్రమంలో పంజాబ్ లో కూడా అక్షయ్ కుమార్ సూర్యవంశి సినిమా విడుదలైంది. రైతు చట్టాలకు మద్దతివ్వకుండా మా ప్రాంతంలో సినిమా ఎలా విడుదల చేస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పంజాబ్ లోని హోషియార్ పూర్ లో సినిమా ఫ్లెక్సీలు చించేసి నానా హంగామా చేశారు. రైతు చట్టాలను రద్దు చేసే వరకు ఆ సినిమాని ఆడనివ్వబోమంటూ ఎదురు తిరిగారు. అక్షయ్ సినిమానే కాదు, అసలు సినిమాల ప్రదర్శనకే ఒప్పుకోమంటూ తేల్చి చెప్పారు. దీంతో అక్షయ్ తొలి బాధితుడిగా మారారు.

కరోనా కష్టకాలంలో అక్షయ్ కుమార్.. పీఎం కేర్స్ కి భారీ విరాళం ఇచ్చి తన పెద్దమనసు చాటుకున్నారు. గతంలోనూ అక్షయ్ కుమార్ పలు దాన ధర్మాలతో వార్తల్లోకెక్కారు. అలాంటి హీరోకే ఇప్పుడు రైతుల సెగ తప్పలేదు. రైతు చట్టాలపై అక్షయ్ కాదు కదా, బీజేపీని ఎదిరించి ఇంకెవరూ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఒకవేళ సినిమా హీరోలు మద్దతిచ్చినంత మాత్రాన కేంద్రం మనసు కరిగిపోతుందని, నూతన వ్యవసాయ చట్టాలు రద్దవుతాయని చెప్పలేం.

కానీ పంజాబ్ రైతులు మాత్రం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. సంచలనం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సూర్యవంశి నుంచి మొదలైన ఈ బ్యాన్ ఇంకా ఎన్ని సినిమాలకు విస్తరిస్తుందో చూడాలి.