కుప్పం మున్సిపాల్టీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో అనుమానాలున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. గత 35 ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గంలో ఓటమిపై సందేహం కలిగించడంలో ప్రత్యర్థి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. కుప్పం అంటే టీడీపీ అడ్డా అనే రోజులకు కాలం చెల్లిందని వైసీపీ నిరూపించింది.
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. అన్ని వార్డులకు నామినేషన్లు వేయడమే టీడీపీకి పెద్ద సవాల్‌గా మారింది. చంద్రబాబునాయుడి నియోజకవర్గంలో ఇలాంటి దుస్థితి వస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ వూహించి వుండరు.
రాజకీయాల్లో ఊహకు అందని సంచలనాలు సృష్టించడంలో జగన్ తర్వాతే మరెవరైనా? అసలు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా తానే ప్రచారం చేసే పరిస్థితికి జగన్ తీసుకొస్తారని చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే కాదు, చివరికి తన సొంత నియోజకవర్గంలో కూడా రాజకీయంగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని చంద్రబాబుకు తెలిసొచ్చింది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో ఏదైనా జరగొచ్చని, స్థానిక ఎమ్మెల్యేగా తన ఓటు కూడా కీలకం కావచ్చని చంద్రబాబు ఆలోచించారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా చంద్రబాబు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
తమ సొంత నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కుప్పంలో హోరాహోరీ పోరును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అక్కడ మున్సిపాలిటీలో ఓటును రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది.