పరిపాలన రాజధానిగా విశాఖ.. దీనిపై కొంతమంది ఉత్తరాంధ్ర వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. కేవలం సెక్రటేరియట్ వస్తే ఏం ఉపయోగం, సమగ్రాభివృద్ధి కావాలంటూ కామెంట్స్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. పైగా మరోసారి విశాఖ కేంద్రంగా అభివృద్ధి చేస్తే మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి ఏంటనే విమర్శ కూడా ఉంది. పైగా ఆల్రెడీ కాస్ట్ లీ అయిపోయిన వైజాగ్ ను మరింత కాస్ట్ లీగా మార్చేస్తున్నారనే వాళ్లు కూడా ఉన్నారు. స్థానికంగా వినిపిస్తున్న ఈ అనుమానాలు, విమర్శలన్నింటికీ జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టబోతున్నారు.
అవును.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను తయారుచేసే క్రమంలో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ముందుగా విశాఖ-విజయనగరం కారిడార్ పై దృష్టిపెట్టారు. విశాఖ నుంచి విజయనగరంకు 50 కిలోమీటర్ల దూరం. ఈ దూరాన్ని పూర్తిగా చెరిపేసేలా రెండు నగరాల మధ్య సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు.
ఇక్కడ ప్రభుత్వానికి బాగా కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ రెండు జిల్లాల మధ్య ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఓవైపు జాతీయ రహదారి, మరోవైపు సువిశాలమైన సముద్ర తీరం ఉండనే ఉన్నాయి. ఇక ఈ రెండు ప్రాంతాల మధ్యనే భోగాపురం ప్రతిపాదిత విమానాశ్రయం కూడా ఉంది. అలా విశాఖ-విజయనగరం రూపురేఖల్ని మార్చేయాలనేది జగన్ మాస్టర్ ప్లాన్.
సచివాలయం విశాఖకు పరిమితమైనా.. ఇతర పరిశ్రమలన్నీ ఈ రెండు నగరాల మధ్య ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా అంగీకరించారు. అంతేకాదు.. బాబు హయాంలో మధురవాడ వరకు మాత్రమే ప్రతిపాదించిన మెట్రో రైల్ ను భోగాపురం వరకు పొడిగించాలని కూడా జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల విశాఖ, విజయనగరం జిల్లాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయి. తద్వారా పొరుగునే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు కూడా లబ్ది చేకూరుతుంది.
ఈ మొత్తం వ్యవహారానికి “కాన్సెప్ట్ సిటీ” అనే పేరును ప్రతిపాదిస్తున్నారు జగన్. పేరుకు విశాఖ పరిపాలన రాజధాని అని చెబుతున్నప్పటికీ.. 3 జిల్లాల సమగ్ర అభివృద్ధికి విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ ఇప్పటికే పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేసింది. అంతేకాదు.. 3 జిల్లాల్లో కొండలపై ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది.
ఎప్పుడైతే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలవుతుందో.. అప్పుడిక దశలవారీగా ఈ ప్రణాళిక అమల్లోకి వస్తుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లా భవిష్యత్తో లో విశాఖ-విజయనగరం అభివృద్ధి చెందాలనేది జగన్ ఆకాంక్ష.