మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ బిల్లులపై హైకోర్టు విధించిన స్టే ఈరోజుతో ముగిసింది. మరోవైపు ఈ వివాదాన్ని హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఏపీ ప్రభుత్వానికి సూచించడంతో.. నేడు జరిగే విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ ఆమోదం కూడా పొందిన ఈ బిల్లులపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై అమరావతి ప్రాంత రైతులతో పాటు ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎక్కడ్నుంచి పరిపాలన సాగించాలి, ఏ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకోవాలి, ఎన్ని రాజధానులు ఉండొచ్చు లాంటి అంశాలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిథిలో ఉంటాయని, కేంద్రానికి దానితో ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించింది.
అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిథిలోకి వస్తుందని.. పైగా చట్టసభల్లో నిర్ణయించి, గవర్నర్ ఆమోదం కూడా పొందిన బిల్లులు కోర్టు పరిథిలోకి రావని చెబుతోంది. దీంతో పాటు విభజన చట్టంలోని అంశాల్ని కూడా వివరించింది.
విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందని, అసలు ప్రత్యేక హోదానే ఇవ్వకపోతే ఇక విభజన చట్టం అమలుని ఎలా లెక్కలోకి తీసుకోవాలంటూ కోర్టుకు విన్నవించింది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంతకాలం విభజన చట్టం అమలు సంపూర్ణం కానట్టేనని ఏపీ ప్రభుత్వం అభిప్రాయ పడింది. మూడు రాజధానుల అంశానికి, విభజన చట్టానికి మధ్య లింక్ పెట్టాలని చూసిన టీడీపీ ఎత్తుగడలకు జగన్ సర్కార్ ఇలా చెక్ పెట్టింది.
అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో జగన్ కు చుక్కెదురైందని, మరోసారి అక్షింతలు పడ్డాయని పచ్చ మీడియా పండగ చేసుకుంటోంది. హైకోర్టు ఇచ్చిన స్టే ముగిసింది కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ చేపట్టలేమని మాత్రమే అత్యున్నత ధర్మాసనం చెప్పింది. పైగా హైకోర్టులో ఏదో ఒక అంశం తేలిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు కలుగజేసుకుంటుందని, హైకోర్టులో విచారణ దశలో ఉన్న అంశంపై స్పందించదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మాత్రం దానికే బాబు మీడియా జగన్ కు చుక్కెదురైందంటూ సంబరాలు చేసుకుంటోంది.
కానీ వాస్తవం ఏంటంటే.. పైన చెప్పుకున్న అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే హైకోర్టులో ప్రభుత్వానిదే పైచేయిగా ఉంది. ఈ విషయంలో జగన్ సర్కార్ కు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు అంతా అఫిడవిట్లు దాఖలు చేయడంతో.. ఈరోజు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.