అసలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని ఎవరు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు? సుశాంత్ కు న్యాయం జరగాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ల వెనుక ఏ స్వార్థం ఉంది? ఇందులో బిహార్ ఎన్నికల రాజకీయం ఉందనే మాటకు కొన్ని ఫేక్ ఫొటోలు ఊతం ఇస్తుండటం గమనార్హం! ఇది సోషల్ మీడియా యుగం.. అక్కడ అబద్ధాలకు కూడా అంతే ఊపు ఉంది.
ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ హ్యాష్ ట్యాగ్ లో అనేక నకిలీ ఫొటోలు, నకిలీ వాదనలు కూడా కలిసిపోతున్నాయి. దక్షిణాది ఈ మ్యాటర్స్ ను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు కానీ.. ఉత్తరాదిన మాత్రం సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, సుశాంత్ మరణాన్ని వాడుకుంటూ.. వయా దావూద్ ఇబ్రహీం ను వాడుకుంటూ.. అంతిమంగా రాజకీయ ప్రయోజనాలను పొందాలని కొంతమంది సోషల్ మీడియా లో ఒక హిడెన్ అజెండాను నడిపిస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
సుశాంత్ ది హత్యా, ఆత్మహత్యా.. అనే విషయం తేల్చాల్సింది విచారణ సంస్థలు. అయితే.. సోషల్ మీడియా ఈ విషయంలో అతిగా విచారణ చేసేస్తోంది. ఏదేదో కల్పిస్తూ ఉంది. కరోనాకు ఆవు పేడతో విరుగుడు అంటూ ఆరు నెలల కిందట ప్రచారం చేసిన బ్యాచ్.. ఇప్పుడు సుశాంత్ మరణం మీద తన ఫేక్ వెర్షన్ వినిపిస్తూ ఉన్నట్టుంది!
గత కొన్నాళ్లలో ఆ బ్యాచ్ ప్రచారం చేసిన కొన్ని ఫొటోలు అడ్డంగా దొరికిపోయేలా చేస్తున్నాయి. అందులో ఒకటి ఆదిత్య ఠాక్రే – రియా చక్రబర్తిల సంబంధం గురించి. వారిద్దరూ ఒకే కార్లో ప్రయాణిస్తున్నారంటూ ఒక ఫొటోను ప్రచారంలోకి తీసుకొచ్చారు. సుశాంత్ మరణం వెనుక ఆదిత్యఠాక్రే హస్తముందని ఒక బ్యాచ్ గట్టిగా ఆరోపిస్తూ ఉంది. తమ ఆరోపణకు బలాన్ని చేకూర్చడానికి ఒక ఫొటోను ప్రచారం లోకి తీసుకొచ్చారు. ఆదిత్య – రియా ఒకే కార్లో ప్రయాణిస్తున్నారు చూడండి అంటూ ఊదరగొట్టారు.
అయితే ఆ ఫొటోలో ఉన్నది రియా కాదు. ఆమె దిశా పటానీ. ఆదిత్య- దిశాలు ఎందుకు కార్లో వెళ్లారనేది వేరే సంగతి. అయితే దిశా పటానీని చూపి.. ఆమె రియా చక్రబర్తి అంటూ నమ్మించే ప్రయత్నాలు జరిగాయి! సోషల్ మీడియాలో ఉన్నది గొర్రెలు అని కొంతమంది ఫీలింగ్. అందుకే వారు ఫేక్ ఫొటోలను ప్రచారం లోకి తీసుకురాగలరు. తమ అజెండాలను ప్రచారం చేసుకోగలరు.
ఇక రెండో ఫొటో.. రణ్ వీర్, దీపిక, సంజయ్ లీలా భన్సాలీ ఉన్న ఫొటో. వారు డిన్నర్ చేస్తున్న ఆ ఫొటోలో దావూద్ ఇబ్రహీం కూడా కూర్చున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆ ఫొటోలోని ఒక బాలీవుడ్ టెక్నీషియన్ ను దావూద్ ఇబ్రహీంగా చెబుతూ పోస్టులు పెట్టారు. ఆ విషయాన్ని నమ్మే సోషల్ మీడియాలోని ఇతర గొర్రెలు షేర్ చేశాయి. ఇంతకీ ఆ ఫొటోకు ఉన్న క్యాప్షన్ ఏమిటో తెలుసా? జస్టిస్ ఫర్ సుశాంత్!
సుశాంత్ కు న్యాయం జరగడానికి, దీపికా రణ్ వీర్ ల ఫొటోకూ సంబంధం ఏమిటి? అందులో ఉన్నది దావూద్ కూడా కాదు. ఏదో పాత ఫొటో పట్టుకుని బాలీవుడ్ టెక్నీషియన్ ను దావూద్ అని చెబుతూ, ఫోటోలు పెట్టి.. సుశాంత్ కు న్యాయం జరగాలని నినదించడం వెనుక రాజకీయ అజెండ తప్ప.. చనిపోయిన ఆ నటుడి మీద ఏదైనా జాలి, దయ కనిపిస్తూ ఉందా? సుశాంత్ మరణాన్ని ఇలా ఫేక్ పోస్టులతో అడ్డంగా వాడుకుని.. సోషల్ మీడియాలోని జనాలను గొర్రెలుగా మార్చుకుని.. కొంతమంది తమ పొలిటికల్ అజెండాకు తగ్గట్టుగా భావోద్వేగాలను బాగా రెచ్చగొడుతున్నట్టుగా ఉన్నారు.
బిహార్ ఎన్నికలు దగ్గర్లో ఉన్నట్టున్నాయి కదా..అంత వరకూ ఇలాంటి భావోద్వేగాలు మరింతగా రెచ్చగొడతారు, ఆ తర్వాత సుశాంత్ మరణాన్ని గాలికి వదలడం వారికి పెద్ద కష్టం ఏమీ కాదు. అవసరం తీరిపోతుంది కదా!