కత్తి పట్టిన వాడు ఆ కత్తికే పోతాడని మన పెద్దలు చెప్పారు. ఇది నిజం కూడా. ఇతరుల్ని తుదముట్టించాలని మరణాయుధాలు చేతపట్టిన వారెవరైనా చివరికి అవే మారణాయుధాల వేటుకు ప్రాణాలు పోగొట్టుకున్న అనేక మందిని ఈ సమాజం చూసింది. పెద్దలు చెప్పిన హితవు ఒక్క కత్తికే మాత్రమే కాదు…ఇతర సంఘటనలకు వర్తిస్తుంది.
ఇప్పుడీ సూత్రం టీడీపీ అధినేత, 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలైన చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటూ ప్రధాన ప్రత్యర్థి అయిన పాలక పార్టీని అడగడుగునా అడ్డుకోవచ్చని, చివరికి ప్రజలకు ఏమీ చేయని పార్టీగా వైసీపీని దోషిగా నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ఎత్తుగడగా…ఇటీవల ఆయన ధోరణులను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో ఎజెండా ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన స్ట్రాటజీ ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడానికి ఒక రకమైన వ్యూహాన్ని, అలాగే పాలక పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సంక్షేమ పథకాల అమలు, ఇతరత్రా వ్యూహాలతో ముందుకెళుతుంటుంది.
ఐదేళ్ల కాలంలో పాలక ప్రతిపక్ష పార్టీలు అనేక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఆర్థిక అంగబలాలతో ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నట్టు….ఆ పార్టీ ఎత్తుగడలను బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
జగన్ ఏడాది పాలనలో అనేక సంచలన నిర్ణయాలకు సాక్షిగా నిలిచింది. అలాగే సంక్షేమ పథకాల్లో అమల్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 90 శాతం హామీలను అమలు చేసిందని ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుబంధ ఎల్లో మీడియానే అంగీకరి స్తున్నాయి. తండ్రి వైఎస్సార్ లాగే జగన్ చెప్పింది తప్పక చేస్తాడనే నమ్మకాన్ని, భరోసాను ప్రజల్లో మరింత గట్టిగా కలిగించ గలిగారు.
దీంతో జగన్ పాలన ఇట్లే కొనసాగితే భవిష్యత్‌లో తన పార్టీ మనుగడకే ప్రమాదమని చంద్రబాబులో భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి చంద్రబా బుకు పెద్ద అడ్డంకిగా మారింది. హైదరాబాద్‌లో ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. జూమ్‌లో మాట్లాడుతూ తన ఎల్లో మీడియాను ఆడ్డుపెట్టుకుని ఏదో చేస్తున్నట్టు భ్రమ కలిగించే ప్రయత్నం బాబు చేస్తున్నారు. అయితే ఇవి తనకు ప్రచారం తేవడం తప్ప…ప్రజల్లో పలుకుబడి పెంచవని చంద్రబాబుకు బాగా తెలుసు.
ఈ నేపథ్యంలో జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు వ్యవస్థల ద్వారా అడ్డుకోవాలని వ్యూహాన్ని చంద్రబాబు రచించారు. కొన్ని సాంకేతికపరమైన అంశాల్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన అనుయాయుల ద్వారా ప్రతి అంశంపై న్యాయ స్థానాలను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును ఎవరూ కాదనలేరు. అలాగని అడ్డమైన వాటికి న్యాయ స్థానాలను ఆశ్రయించడం అంటే వాటి విలువైన సమయాన్ని హరించి వేయడమే అవుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
అయితే చంద్రబాబు తనకు తెలియకుండానే ఓ పెద్ద ఊబిలోకి ఇరుక్కుపోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజలతో మమేకం కావాల్సిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రతి అంశంపై కోర్టు మెట్లు ఎక్కుతూ…క్షేత్రస్థాయిలో ప్రజలతో క్రమంగా సంబంధాలు పోగొట్టుకుంటున్నారు. రాజకీయ వ్యవస్థలతో ఇది చాలా తీవ్రమైన అంశం. చంద్రబాబు సహా ఆ పార్టీ నాయకులంతా పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతూ ప్రతిపక్ష పార్టీగా తమ కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితిని గత ఏడాదిగా చూస్తున్నాం.
అసెంబ్లీలో కేవలం ఒక ఎమ్మెల్యే బలం ఉన్న జనసేన పార్టీ విశాఖలో లాంగ్‌మార్చ్ పెడితే…అలాంటిది చెప్పుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేపట్టిన దాఖలాలు లేవు. ఎంతసేపూ కోర్టుల్లో జగన్ సర్కార్‌కు 70 కేసుల్లో ప్రతికూల తీర్పులొచ్చాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంబరపడిపోతోంది.
వాటిపై తన చానళ్లలో గంటల తరబడి డిబేట్లు నిర్వహిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తే…వద్దని అడ్డుకోవడం ద్వారా ఎవరికి నష్టం? జగన్ సర్కార్‌కు దీని వల్ల నష్టమేం టి? అంతిమంగా ప్రజల్లో అభాసుపాలైంది ఎవరు? అంతెందుకు మూడు రాజధానుల అంశాన్నే తీసుకుందాం. సాంకేతిక అం శాల్ని అడ్డుపెట్టుకుని మరో రెండేళ్లో, మూడేళ్లో విశాఖ, కర్నూలుకు ఎగ్జిక్యూటివ్, న్యాయ రాజధానుల తరలింపును అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీని వల్ల నష్టం జగన్ సర్కార్‌కా? చంద్రబాబుకా? జగన్ పాలనలోని లోపాలు చర్చకు రాకుండా, తిరిగి ఎన్నికలు వచ్చే వరకు రాజధానిపై చర్చే సాగుతుంది. మరోవైపు తమ ప్రాంతాలకు రాజధానులు రాకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై రాయలసీమ, ఉత్తరాంధ్రలలో మరింత కసి పెరుగుతుంది. అదే సమయంలో జగన్ చేయాలనుకుంటున్నారనే సానుకూల అభిప్రాయం వెనుకబడిన ఆ ప్రాంతాల్లో కచ్చితంగా మరింత పెరుగుతుంది.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాజధాని అంశం ఎంత ఆలస్యమైతే అంత మంచిది. ఎందుకంటే రాజధాని అంశమే ప్రధాన ఎజెండాగా ఆయన ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతారు. అప్పుడు కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు నిలబడుతారా? ఒకవేళ చంద్రబాబు స్టాండ్ అదే అయితే మిగిలిన ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం ఉంటాయా? ఎప్పుడూ కోర్టుల్లో కేసులు వేయిస్తూ…ఏదో చేయాలనే చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనలు జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుతున్నాయి.
ఈ వేఖరే ఆయన కొంప ముంచనుంది. నేతల తలరాతలను మార్చే శక్తి ఒక్క ప్రజాకోర్టుకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు మించిన తీర్పరులు మరెవరూ లేరు. ప్రజాకోర్టు మినహా మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఏదో సాధిస్తున్నానని చంద్రబాబు అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు.
కోర్టులను నమ్ముకుని ప్రజలకు దూరమవుతున్న చంద్ర బాబు….భవిష్యత్‌లో తగిన మూల్యాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే చర్యకు ప్రతిచర్య అనేది ప్రకృతి సిద్ధాంతం. దానికి అతీతంగా ఎవరూ మనుగడ సాగించలేరు.