ప్రపంచ వ్యాప్తంగా లెక్కలు తీసుకున్నా.. దినవారీగా అత్యధిక కేసులు నమోదు విషయంలో ఇండియా ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో ఏకంగా 76 వేల స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇంత వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం లెక్కలను తీసుకున్నా.. ఈ స్థాయిలో కేసులు పీక్స్ అని చెప్పవచ్చు. అమెరికాలో జూలై 25న 78 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అదే దేశంలో జూలై 17న 76,930 కేసులు నమోదయ్యాయి. వాటి తర్వాత ఒకే రోజు 76 వేల స్థాయి కేసులతో ఇండియా మూడో స్థానంలో నిలుస్తోంది. ఒకే రోజు అత్యధిక కేసుల విషయానికి వస్తే ఇండియాలో ఏకంగా 76 వేల స్థాయిలో నమోదు కావడం ఇదే తొలి సారి.
కరోనాకు జనం భయపడటం దాదాపు తగ్గిపోతోంది. సిటీ బస్సుల ప్రయాణాలు, వలస కార్మికులు మళ్లీ నగరాల బాట పట్టడంతో పాటు… దాదాపు అన్ని యాక్టివిటీస్ యథారీతికి వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అన్ లాక్ ఫోర్ ను షూరూ చేస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి నిబంధలను మరింత సడలించబోతున్నారు.
కర్ణాటకలో అయితే థియేటర్లతో పాటు మాల్స్ లోని అన్నింటినీ ఓపెన్ చేయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందట. ఆ రాష్ట్రంలో కరోనా నంబర్లు భారీగా పెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం సడలింపులకు సానుకూలంగా ఉందట. బెంగళూరులో ప్రముఖమైన కేఆర్ మార్కెట్ ఏరియాను తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని అక్కడి షాపుల వారు నిరసనలు కూడా మొదలుపెట్టారు. ఇలా ఓపెనప్ కు వ్యాపారులు, ప్రజలు మొగ్గుచూపుతున్నట్టుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసులు కూడా పెరుగుతూ ఉన్నట్టున్నాయి.