మళ్లీ సెలబ్రిటీల సందడి మొదలవుతోంది. ఆరు నెలలుగా ఇళ్లు దాటడం లేదు చాలా మంది స్టార్లు అని వేరే చెప్పనక్కర్లేదు. మార్చిలో షూటింగులు ఆగిపోగా.. ఆగస్టు దాదాపు పూర్తవుతోంది. కరోనా తీవ్రంగా వ్యాపించడంతో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అలా కాదని బయటకు వచ్చిన కొందరు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్, ఆయన తనయుడు, కోడలు కూడా కరోనాకు గురయ్యారు. అమితాబ్ ఒక ఈవెంట్ కు హాజరు కావడంతోనే కరోనా సోకిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత వారు కోలుకున్నారు.
ఇక మరి కొందరు స్టార్లు అయితే ఇళ్లు దాటమన్నా దాటలేదట. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టీ ఆరు నెలలుగా ఇళ్లు దాటిందే లేదట. ఆయన తనయుడు ఈ విషయాన్ని చెప్పాడు. తన తండ్రి పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడని, ఎప్పుడైనా అలా కార్ వేసుకుని రైడ్ కు వెళ్లమని.. తాము చెప్పినా ఆయన ఆసక్తి చూపలేదని దుల్కర్ చెప్పాడు. ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం కావడం పట్ల తాము ఆశ్చర్యపోయినట్టుగా ఆ హీరో చెప్పాడు. కేవలం మమ్ముట్టీ మాత్రమే కాదు చాలా మంది సినీ స్టార్లు అలా ఇంటి గేటు దాట లేదని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ముంబై తారల్లో కాస్త మార్పు కనిపిస్తూ ఉంది. వాళ్లు ఇళ్లు దాటుతున్నారు. మాస్కులు వేసుకుని మీడియాకు కనిపిస్తున్నారు. చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అలాగే జిమ్ లకు వెళ్లే వాళ్లూ అక్కడ కెమెరాలకు హాయ్ చెబుతున్నారు. వాస్తవానికి ముంబైలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే నిబంధనల్లో కాస్త రిలాక్సేషన్ వచ్చినప్పటి నుంచి అక్కడ సినిమా వాళ్లు ఎప్పుడెప్పుడు బయట తిరగాలనే ఆసక్తినే కనబరుస్తున్నారు.
అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో వెనుకడుగు వేసిన వాళ్లు.. ఇప్పుడిప్పుడు మాత్రం మళ్లీ బయట కనిపిస్తున్నారు. బాలీవుడ్ జనాలు అలా బయటకు వస్తున్నా.. టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఈ సందడి కనిపించడం లేదు. షూటింగులకే కాదు, సరదాగా కూడా సినిమా వాళ్లు బయటకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదింకా.