ఆంధ్రకు వెళ్లాలంటే అంత బాధ ఎందుకో?

సివిల్ సర్వీసెస్ అధికారులు.. దేశంలోనే అత్యున్నతమైన అలాంటి ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక అయ్యేప్పుడే.. తాము ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితమై సేవలు అందించబోవడం లేదు అనే క్లారిటీతో ఉంటారు. ‘సొంత’ అనే పదానికి అతీతంగా…

సివిల్ సర్వీసెస్ అధికారులు.. దేశంలోనే అత్యున్నతమైన అలాంటి ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక అయ్యేప్పుడే.. తాము ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితమై సేవలు అందించబోవడం లేదు అనే క్లారిటీతో ఉంటారు. ‘సొంత’ అనే పదానికి అతీతంగా తాము దేశానికి సేవ చేస్తున్నాం అనే స్పృహతో ఉంటారు. కానీ.. సొంత రాష్ట్రాల్లోనే పనిచేసే అవకాశం కూడా కొందరికి వస్తుంది గానీ.. ఆ కోరికకు పరిమితం అయిపోవడం జరగదు. అలాంటి నేపథ్యంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సర్వీసుకు వెళ్లాలంటే ఎందుకంతగా బాధపడిపోతున్నారో మాత్రం అర్థం కావడం లేదు. 

సోమేష్ కుమార్ తెలంగాణ కు చెందిన ఐఏఎస్ అధికారి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలంగా కోరుకున్న ఐఏఎస్ అధికార్లలో ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత.. ఆయన చాలాకాలం జీహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా ఉన్నారు. ఆ సమయంలో చాలా విషయాల్లో దూకుడుగా వ్యవహరించారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. 

సీమాంధ్రులు ఎక్కువగా నివసిస్తుండే అయ్యప్పసొసైటీ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలను దారుణంగా కూలగొట్టిస్తూ సంచలనం సృష్టించారు. కోర్టు దృష్టిని ఆకర్షించారు. నిర్మాణాలు జరిగేప్పుడు.. ఉపేక్షిస్తూ ఉండిపోయిన జీహెచ్ఎంసీ… కూలగొట్టడంలో దూకుడుపై కోర్టు ఆక్షేపణలు వ్యక్తంచేసింది. మొత్తానికి ఆ రకంగా ఆంధ్రోళ్లంటే ద్వేషించే ఐఏఎస్ అధికారిగా సోమేష్ కుమార్ ముద్ర పడ్డారు. 

అయితే అప్పటికే ఆయనను విభజన అనంతర కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించి ఉన్నారు. తెలంగాణలోనే తాను కొనసాగేలా ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ పదవినుంచి ఏకంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అయ్యారు. ప్రభుత్వాన్ని నడిపే కీలకపదవిలో చాలాకాలంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు షాక్ తప్పలేదు. 

ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దుచేస్తూ..ఆయన ఏపీ సర్వీసుకు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. అప్పీలుకు వెళ్లడం కోసం ఈ తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపివేయాలని న్యాయవాది కోరినా కూడా హైకోర్టు నిరాకరించింది. ఏపీ కి వెళ్లాల్సిందేనని తేల్చేసింది. 

అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిగా హుందాగా ప్రవర్తించకుండా.. సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడానికి ఎందుకంత బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన సీఎస్ పదవి పోతుంది. అప్పీలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు గానీ.. ఆంధ్రప్రదేశ్ సర్వీసుకు వెళ్లకుండా ఉండాలంటే ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టవలసి వస్తుంది. 

ఒకసారి వెళ్లి ఆంధ్రప్రదేశ్ సర్వీసులో చేరిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, దానికి ఏపీ సర్కారు అంగీకరిస్తే.. ఆయన ఇక శాశ్వతంగా తెలంగాణ సర్వీసుకు వచ్చేయవచ్చు. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా తెలంగాణ సర్వీసులో ఉంటూ అదే తరహాలో ఏపీకి వెళ్లారు. కానీ.. అలాంటి నియమబద్ధమైన మార్గాలను ఆశ్రయించకుండా.. సోమేష్ కుమార్.. అసలు ఏపీ సర్వీసుకు వెళ్లడమే ఇష్టం లేదన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎవ్వరికీ బోధపడ్డం లేదు.