తెలుగు సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ ఢమాల్ మనేసిందని ఇప్పటికే అనేకసార్లు చెప్పుకున్నాం. ఏ సినిమాలకు కూడా బయ్యర్లు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
పెద్ద సినిమాలు ఏదో అమ్మాం అనిపించుకుని, తెరవెనుక డిస్ట్రిబ్యూషన్ చేయించుంటున్నాయి. కొన్ని బ్యానర్లకు పర్మనెంట్ బయ్యర్లు వున్నారు కాబట్టి నడచిపోతోంది. మిగిలిన సినిమాలకు పరిస్థితి కాస్త క్లిష్టంగా వుంది. తెగించి కొంటే చేతులు మొదలంటా కాలిపోతున్నాయి.
మొన్నటికి మొన్న మీకు మాత్రమే చెప్తా సినిమాకు బయ్యర్ కు 80 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అందుకే రూలర్, వరల్డ్ క్లాస్ లవర్ సినిమాలకు ఇంకా ఓవర్ సీస్ బిజినెస్ కాలేదు. దీంతో పాటే నాగ్ చైతన్య-వెంకటేష్ ల వెంకీమామ సినిమాకు కూడా అదే పరిస్థితి వుంది.
వెంకీ మామ సినిమాకు ఓవర్ సీస్ రేటు మూడుకోట్లు అడుగుతున్నారు. అంత రేటు అంటే ఎవ్వరూరావడం లేదు.
వాస్తవానికి వెంకీమామ నిర్మాతలు పీపుల్స్ మీడియాకు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వుంది. అయినా రేటు వస్తే ఇద్దామని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. మూడు కోట్లు అంటే ఎవ్వరూ రావడ లేదు.
ఇదే సినిమా ఆంధ్ర 18 కోట్ల రేషియోలో చెబుతున్నారు. దాంతో బయ్యర్లు అల్లంత దూరంలోనే వుండిపోతున్నారు. సినిమాకు దగ్గర దగ్గర యాభై కోట్ల వ్యయం కావడంతో ఈ రేటుకు అమ్మితే తప్ప కిట్టుబాటు కాదు. కానీ ఆ రేటు అంటే బయ్యర్లు అమ్మో అంటున్నారు.
దాంతో ఇక సురేష్ మూవీస్ తో నేరుగా విడుదల చేయించడం తప్ప మరో మార్గం వున్నట్లు గా కనిపించడం లేదు.