పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన హీరో

తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని గతంలోనే ప్రకటించాడు హీరో విశాల్. ఆ దిశగా అతడు కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ప్రస్తుతానికైతే సినిమాలకే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు తన రాజకీయ ఆలోచనల్ని…

తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని గతంలోనే ప్రకటించాడు హీరో విశాల్. ఆ దిశగా అతడు కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ప్రస్తుతానికైతే సినిమాలకే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు తన రాజకీయ ఆలోచనల్ని పక్కనపెట్టేశాడంటూ కథనాలు వచ్చాయి. విశాల్ వాటిని ఖండించాడు. సరైన టైమ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించాడు.

“పూర్తిస్థాయి రాజకీయాలపై నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఈ టైమ్ లో ఇలానే చేయాలని ఏదీ అనుకోలేదు. పైన దేవుడు అనుగ్రహించాలి, కింద భూమిపై పరిస్థితులు అనుకూలించారు. ఈ రెండూ కలిసొచ్చినప్పుడు ఆటోమేటిగ్గా నా రాజకీయ ప్రస్థానం మొదలవుతుంది. ప్రస్తుతానికైతే నా దృష్టి మొత్తం సినిమాలపైనే.”

ఇలా తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించాడు విశాల్. గతంలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశాడు విశాల్. అయితే, ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో విశాల్ వేసిన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

దీంతో పోటీ చేయలేకపోయిన విశాల్.. ఆ తర్వాత మరో నియోజకవర్గం కోసం చిన్నపాటి సర్వే కూడా చేయించుకున్నాడు. అంతలోనే తమిళనాడు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అప్పట్నుంచి విశాల్ పొలిటికల్ ఎంట్రీపై కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే తను రాజకీయాల నుంచి తప్పుకోలేదని, ఏదో ఒక టైమ్ లో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో.