ప్రశాంత్ కిషోర్ మాదిరిగా క్షేత్రస్థాయి సర్వేల ఆధారంగా చెబుతున్న సూత్రాలు కావివి. అలాగే యండమూరి రాసినట్టు “విజయానికి ఐదుమెట్లు” లాంటి సుదీర్ఘ గ్రంథం కూడా కాదిది.
సగటు సామాన్యుడిగా సాటి సామాన్యులు ఏం కోరుకుంటున్నారు, ఏ పార్టీలో ఏ విటమిన్ లోపం ఉంది, ఏం చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంటిలిజెన్స్ తో కాకుండా కామన్ సెన్సుతో పంచుకుంటున్న విషయాలన్నమాట.
2024 ఎన్నికలకి ఇంకా రెండున్నరేళ్లున్నాయి. అంటే సరిగ్గా ఫస్టాఫ్ అయ్యి సెకండాఫ్ మొదలయ్యింది.
ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, ఏం చేస్తే బాగుంటుందో చూద్దాం.
వైసీపీ:
151 ఎమ్మెల్యే మరియు 23 ఎంపీ సీట్లతో అత్యధిక మెజారిటీతో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఇది. 2019 సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, బై-ఎలక్షన్స్ లో కూడా విజయదుందుభి మోగించింది. అయితే ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగినా ఓటర్లు వైసీపీ పక్షాన్నే ఉన్నారని కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది.
బద్వేల్ ఉప ఎన్నికకి తెదేపా అసలు కాండిడేట్ నే నిలబెట్టకుండా ఏదో సాకు చెప్పి తప్పించుకుంది. జనసేన కూడా అంతే. వైసీపీ కేండిడేట్ ఏకగ్రీవం అని తేలిపోయింది. వల్లభనేని వంశీ ఇప్పటికిప్పుడు గన్నవరం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైకాపా తరపున పోటీ చేస్తానని, దమ్ముంటే తెదేపా నుంచి లోకేష్ వచ్చి తనపై పోటీ చెయ్యమని చాలెంజ్ విసిరాడు. తెదేపా నుంచి అస్సలు సౌండ్ లేదు.
దీనిని బట్టి జనం తమవైపే ఉన్నారన్న ధీమా వైకాపా వర్గానికి, లేరన్న భయం తెదేపాకి ఉన్నాయి. కానీ రానున్న రెండున్నరేళ్లూ పరిస్థితి ఇలాగే ఉండకపోవచ్చు. జనాభాలో దాదాపు 84% మంది ఏదో ఒక సంక్షేమపథకం అందుకుంటున్నారు. ఇప్పటివరకు అధికశాతం సంతృప్తిగానే ఉన్నారు. కానీ ముందు ముందు రెండు ప్రమాదాలున్నాయి.
ఒకటి- కేంద్రం ఇంధనధరలు పెంచడం వల్ల అన్ని సరకుల ధరలు పెరుగుతాయి. సంక్షేమం ద్వారా అందేది పేదలకి సరిపోదు. పెంచమని డిమాండ్ చేయొచ్చు. పెంచడానికి ప్రభుత్వానికి శక్తిలేకపోవచ్చు. పెంచకపోతే జనం తిరగబడొచ్చు. కనుక ప్రస్తుతం కేటాయించిన సంక్షేమ నిధులు 2024వరకు తమ ఓటర్స్ ని తమవైపు ఉండేలా చేస్తాయనుకోవడం తప్పుడు లెక్క అయ్యే అవకాశం ఉంది.
రెండు- చేస్తున్న అప్పులు ఏదో ఒకనాడు అందకపోవచ్చు. ఈ రెండున్నరేళ్లలో ఆ ప్రమాదం ఎప్పటికీ పొంచుకునే ఉంది. కనుక కేవలం సంక్షేమం అని కాకుండా రోడ్లు వేయడం, ఉపాధి కల్పనికి దారులు వేయడం, అభివృద్ధి జరుగుతోందన్న భరోసా కల్పించడం, కొత్త ఆదాయ వనరులు చూపించడం వంటివి తప్పనిసరిగా చెయ్యాలి.
అప్పుడు పర్సెప్షన్ పాజిటివ్ గా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఓటర్లు కూడా వైకాపా ప్రభుత్వానికి సానుకూలంగా మారతారు. ప్రస్తుత సంక్షేమ పథకాలతో పాటూ 2024 లోపు వైకాపా పాటించాల్సిన ముఖ్యమైన మూడు సూత్రాలు ఇవే.
సూత్రం1: అభివృద్ధి జరుగుతోందన్న భరోసా కల్పించడం
సూత్రం2: ఉపాధి కల్పన చేయడం
సూత్రం3: పెట్టుబడులు తెప్పించడం
తెదేపా:
అరచేతుల్లో అమరావతి స్వర్గం చూపించినా, ఎన్నికల ముందు పసుపుకుంకుమల పేరుతో ఏకంగా పదివేలిచ్చినా 2019లో చిత్తుగా ఓడిపోయిన పార్టీ తెదేపా. ఆ అపజయం నుంచి తేరుకోకుండానే స్థానిక ఎన్నికల్లో చావుదెబ్బలు తినాల్సొచ్చింది.
ఎన్ని రకాల ప్రభుత్వవ్యతిరేక ఉద్యమాలు నడిపినా, అమరావతి రైతులు ఆక్రందనలు చేసినా సాక్షాత్తూ అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రమంతా ఓటర్లు మళ్లీ వైకాపాకే పట్టం కట్టారు. తెదేపా చేస్తున్న ఉద్యమాలు, దీక్షలు దేనికీ పనిచెయ్యడంలేదు.
ప్రజల్లో ఎందుకింత వ్యతిరేకత ఉందో ముందు ఆ పార్టీవారు పరిశోధన చేసుకోవాలి. శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు గడప గడపకి వెళ్ళి మనసుల్ని తట్టాలి. వాళ్లతో మమేకం కావాలి. అంతేకానీ ట్విటర్లో పోస్టులు పెడుతూ, తెదేపా కార్యాలయాల్లో దీక్షలు చేస్తే ఏ ఓటరూ పట్టించుకోడు.
అన్నిటికన్నా మించి ఈ పార్టీ వెన్నుదన్నైన ఒకానొక కులంపై అధికశాతం ఓటర్లలో వ్యతిరేకత ధ్వనిస్తోంది. ఈ పార్టీ ఆ ఒక్క కులానిదే అనే అభిప్రాయం జనాల్లో లోతుగా బలపడిపోయింది. దానిని కరెక్ట్ చేసుకునే దిశగా పనులు చెయ్యాలి. అన్ని కులాల వారినీ కలుపుని వెళ్లే కొత్త మంత్రాంగం చేపట్టాలి.
స్థానికంగా ప్రజలకున్న సమస్యలు ప్రభుత్వం తీర్చనప్పుడు, వీలైనంతవరకూ చొరవగా పదవిలో లేకపోయినా ఈ పార్టీ స్వచ్ఛందంగా చేసిపెట్టాలి. ఈ పార్టీకి ఆర్ధికంగా దన్నునిలిచే అనేకమంది ఎన్నారైలు కూడా ఉంటారు కనుక ఆ శక్తుల్ని నేరుగా ప్రజాప్రయోజనార్ధం ఖర్చు చెయ్యాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకమొస్తుంది.
అంతే తప్ప అధికారవర్గం వారు బూతులు మాట్లాడారని, వీళ్లు కూడా ప్రతిదాడి చేస్తే కలిసొచ్చేదేమీ ఉండదు. మాటల వల్ల ఏ పనీ జరగదు. కేవలం చేతలతో ప్రజల మనసు గెలుచుకోవాలంతే. అలా కాకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామంటే ఉన్న ఓటు బ్యాంకు బ్యాంకు కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది.
ఈ పార్టీకి మూడు సూత్రాలు-
సూత్రం1: దీక్షలు, ఉద్యమాలు పక్కనపెట్టి జనంలోకి వెళ్లడం
సూత్రం2: స్వచ్ఛందంగా ప్రజాప్రయోజనార్థం ఖర్చు చేయడం
సూత్రం3: ఒక కులానికి మాత్రమే చెందిన పార్టీ అనే అపవాదుని కడుక్కునే పనులు చెయ్యడం
జనసేన:
హీరో వీకైనా ప్యాడింగ్ ఆర్టిస్టుల వల్ల ఆడే సినిమాలుంటాయి. జనసేనలో హీరో పవన్ కల్యాణ్. ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవ్వరో ఎవ్వరికీ తెలీదు. ఒక్క నాదెళ్ల మనోహర్ తప్ప మూడో పేరు చెప్పమంటే రాజకీయ విలేకరులకి కూడా తెలియకపోవచ్చు.
పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తన కేడర్ని పెంచుకునే యోచన చెయ్యాలి. మొన్నక వార్తొచ్చింది. ప్రకాష్ రాజ్ ఈ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నాడని. అలా కొత్త మొహాల్ని, కొత్త గళాల్ని పరిచయం చేస్తూ జనంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కష్టమనుకోకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చెయ్యాలి. తెలుగు వాళ్ళు పాదయాత్రలకే ఓట్లేసారని మరిచిపోకూడదు.
అలా కూర్చుంటే చాలు, ఎప్పుడో అప్పుడు పదవి అదే వస్తుంది అనే ధోరణిలో ఉంది ఈ పార్టీ వ్యవస్థాపకుడి పనితీరు. ఇది అస్సలు పనికిరాదు. దేనికోసం పోరాడుతున్నామో, దేని మీద పోరాడుతున్నామో క్లారిటీ ఉండాలి. తెదేపాది అభివృద్ధి ఎజండా, వైకాపాది సంక్షేమం ఎజండా…మరి జనసేన ఎజెండా ఏమిటి? అది బలంగా జనంలోకి వెళ్లాలి. సమసమాజ స్థాపన లాంటి కాలం చెల్లిన కాన్సెప్టులు మాత్రం కాకూడదు.
సూత్రం1: కేడర్ ని పెంచుకోవడం
సూత్రం2: పాదయాత్రలు చేయడం
సూత్రం3: అసలు ఎజెండా ఏవిటో బలంగా చెప్పడం
ఇలా మూడూ పార్టీలూ తమ మూడు సూత్రాలను పాటిస్తే కాస్తైనా ఆయా పార్టీలకి మంచిరోజులొస్తాయని ఒక ఆకాంక్ష.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ లా, “అన్ని పార్టీలూ మంచివే. అందరూ మంచివాళ్లే. అందరూ చల్లగా ఉండాలి” అని కోరుకుంటూ…
– శ్రీనివాసమూర్తి