చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ పవన్, చంద్రబాబు ఎప్పుడూ వేర్వేరు కాదని తామెప్పుడూ భావించలేదన్నారు. ఎప్పుడూ వాళ్లు ఒకటే అని తెలుసన్నారు. ఒకవేళ ఎవరైనా వాళ్లిద్దరూ విడిపోయారని అనుకుంటే తిక్కోళ్లని అనుకోవాలని వెటకరించారు.
కలిసే వున్నారనే విషయం తమకు అర్థమైందని, మీకు (విలేకరులు) అర్థం కాలేదని సెటైర్ విసిరారు. వాళ్లిద్దరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా ఏమీ కాదన్నారు. గత ఎన్నికల సందర్భంలో మంచి చేస్తామని ఓటు అడిగినట్టు బైరెడ్డి గుర్తు చేశారు. ఈ దఫా చేసిన మంచి చూపి ఓటు అడుగుతామన్నారు.
వంద పార్టీలు కలిసినా, వెయ్యి మంది వచ్చినా , వంద మీడియా సంస్థలు కలిసినా, తప్పుడు ప్రచారాలు చేసినా , కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒకటే అంశం గుర్తు పెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగనన్న కోసం పని చేయడానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధంగా వుందని సంచలన వ్యాఖ్య చేశారు. మిమ్మల్ని(ప్రత్యర్థులు) ఎదుర్కోడానికి జగన్మోహన్రెడ్డితో పనిలేదన్నారు. ఆయన కనుసైగ చేస్తే… మీ అందరూ సరిపోతారన్నారు.
జగనన్న మంచి చేస్తున్నాడన్నారు. మార్పు తీసుకొస్తున్నాడన్నారు. అటువంటి జగన్మోహన్రెడ్డికి రక్షణ కవచంగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై కూడా వుందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఈ దఫా 175కు 175 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరి ఆదరాభిమానాలతో గతంలో వైఎస్ జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడన్నారు.