కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడతో, దాన్ని అడ్డుపెట్టుకుని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు కొందరు నేతలు ఆ పార్టీలోకి వెళ్లారు. మరోవైపు టీడీపీలో తమ వారసులో, బంధువులను కొనసాగిస్తూ, రెండువైపులా పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి నేతల్లో బీజేపీ నేత టీజీ వెంకటేశ్ ప్రముఖుడు. ఇలాంటి వాళ్లను పెట్టుకుని ఏపీలో బీజేపీ ఎలా ఎదగాలని అనుకుంటున్నదో ఆ పార్టీకే తెలియాలి.
టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్ కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈ దఫా మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీజీ వెంకటేశ్ మాత్రం టీడీపీ తరపున రాజ్యసభ పదవి పొంది, మరో ముగ్గురితో కలిసి బీజేపీలో చేరారు. అధికారాన్ని అనుభవించారు, ఇంకా అనుభవిస్తున్నారు. టీడీపీ-బీజేపీ ఉమ్మడి అధికార ప్రతినిధి హోదాలో ఆయన ఏపీ రాజకీయాలపై తనవైన అభిప్రాయాల్ని చెబుతుంటారు.
తాజాగా చంద్రబాబు, పవన్ భేటీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు పొత్తులపై స్పష్టత వస్తుందన్నారు. పవన్‌కల్యాణ్ ఒక వైపు బీజేపీతో వుంటూ, మరోవైపు టీడీపీకి దగ్గరవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పదేపదే టీడీపీ దత్తపుత్రుడని వైసీపీ నేతలు విమర్శించడం వల్లే ఆ పార్టీకి పవన్ దగ్గరయ్యారని టీజీ చెప్పుకొచ్చారు. చంద్రబాబును పవన్ కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
తాను బీజేపీలో, కొడుకు టీడీపీలో ఉంటూ… ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నారు. ఈ పెద్ద మనిషి పొత్తులు, ఎవరెవరు ఎందుకు దగ్గరవుతున్నారో, దూరమవుతున్నారో ఉపన్యాసాలు ఇస్తూ ఔరా అనిపించేలా చేస్తున్నారు. ఇంతకూ తాను ఏ పార్టీ నాయకుడో టీజీ వెంకటేశ్ స్పష్టంగా చెప్పగలరా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 2024లో ప్రత్యామ్నాయంగా తామే వస్తామని బీజేపీ నేతలు ఎంత హాస్యాస్పదమో, టీజీ వెంకటేశ్ లాంటి నాయకుల మాటలు వింటే అర్థమవుతుంది.
బీజేపీని బలహీనపరచడానికి ఇలాంటి నేతలు చాలదా? తమ కత్తికి రెండు వైపులా పదును అనే రకంగా ఇటు బీజేపీ, అటు టీడీపీని అడ్డుపెట్టుకుని టీజీ వెంకటేశ్ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.