వైఎస్సార్ ని ఆడిపోసుకున్న కేంద్ర మాజీ మంత్రి

ఆయన పోయి పన్నెండేళ్ళు అవుతోంది. ఆయన గుర్తులు మాత్రం పదిలంగా ఉన్నాయి. మంచికో చెడ్డకో వైఎస్సార్ ని తలవడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. వైఎస్సార్ 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు  అని…

ఆయన పోయి పన్నెండేళ్ళు అవుతోంది. ఆయన గుర్తులు మాత్రం పదిలంగా ఉన్నాయి. మంచికో చెడ్డకో వైఎస్సార్ ని తలవడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. వైఎస్సార్ 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు  అని మెజారిటీ ప్రజలతో పాటు నాటి కాంగ్రెస్ నాయకులు సైతం బలంగా నమ్ముతారు.

అయితే ఇన్నేళ్ళ తరువాత దాన్ని కూడా వివాదం చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తాజాగా విశాఖ టూర్లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు అనేశారు. తెలుగుదేశం పార్టీకి జనంలో పెరిగిన అసంతృప్తి వల్లనే కాంగ్రెస్ నాడు గెలిచింది అని అన్నారు.

వైఎస్సార్ కాదు ఇందిరమ్మ వేసిన బలమైన పునాదుల వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆయన అంటున్నారు. ఆరోగ్యశ్రీ పధకం కూడా ఇందిరమ్మదే అని ఆయన చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీ గెలుపు అంటే అది ఇందిరమ్మ నాటిన కాంగ్రెస్ గెలుపు అని ఆయన కొత్త భాష్యం చెప్పారు.

కాసేపు చింతా మోహన్ చెప్పినది నిజమే అనుకున్నా అధికార పార్టీల మీద వ్యతిరేకత వచ్చినా సొమ్ము చేసుకునే దమ్మున్న నాయకుడు అవతల వైపు ఉంటే కదా జనాలు ఆకార్షితులై ఓటేసేది. ఆ విధంగా చూస్తే వైఎస్సార్ చరిష్మాను కొట్టి పారేయగలరా అన్నది ఆలోచించాలి కదా. తెలంగాణాలో రెండు సార్లు కాంగ్రెస్ ఓడింది, అక్కడ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, మరి కాంగ్రెస్ గెలుస్తుందని గట్టిగా చెప్పగలరా అని అడుగుతున్న వారూ ఉన్నారు.

ఏపీలో వంద సీట్లను వచ్చే ఎన్నికల్లో గెలుచుకుని అధికారాన్ని కైవశం చేసుకుంటామని చింతా మోహన్ అంటే ఏపీసీసీ ప్రెసిడెంత్ రుద్రరాజు సైతం కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ కి జగనే శత్రువు అని ఆయన అంటున్నారు. తండ్రీ కొడుకుల మీద పడి విమర్శలు చేయడం కంటే కాంగ్రెస్ ని చక్కదిద్దుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కదా అంటే ఖద్దరు పార్టీ నేతలు ఏమంటారో.