ఆంధ్ర రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛే లేకుండా పోయిందని, విలేకరులు ప్రశ్నించడం నేర్చుకోవాలని చంద్రబాబు హితవచనాలు పలికారు. అసలు జర్నలిజం వ్యవస్థని నాశనం చేసిందే చంద్రబాబు. ఆంధ్రజ్యోతి, ఈనాడుని తన తాబేదార్లుగా మార్చుకుని ఒక కుట్రగా లక్ష్మీపార్వతి మీద వ్యతిరేక వార్తలు రాయించాడు. ఎన్టీఆర్ ఆమె చేతిలో కీలుబొమ్మగా మారాడని జనం నమ్మేట్టు చేశాడు. ఆ రోజుల్లో సమాచారానికి మీడియా తప్ప వేరే దారిలేదు. ఇవి రెండూ అత్యధిక సర్క్యులేషన్ వున్నవి. మిగతా పత్రికలకి పాఠకులు లేరు.
మీడియా వ్యవస్థకి లంచగొండితనం పూర్తిస్థాయిలో నేర్పింది చంద్రబాబే. ఇది ఎంత దూరం పోయిందంటే మీడియా సాయంతో ఎన్టీఆర్‌పై కుట్ర చేసే వరకూ. నిజానికి చంద్రబాబు వెంట 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఆ రోజుల్లో సెల్ఫోన్లు లేకపోవడం బాబు అదృష్టం. వుంటే వాస్తవాలు తెలిసిపోయేవి. రెండు ప్రధాన పత్రికల్లో చంద్రబాబు వెంట మెజార్టీ ఎమ్మెల్యేలున్నారని అబద్ధాలు రావడంతో ఎన్టీఆర్ వెంట ఉండాలనుకునే ఎమ్మెల్యేలు కూడా గందరగోళానికి గురై బాబు వైశ్రాయ్ శిబిరంలోకి వచ్చారు.
జగన్ పాలనలో పారదర్శకత, ప్రజాస్వామ్యం పరిరక్షణ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే రాధాకృష్ణ ఆ రోజు విలేకరి మాత్రమే. విలేకరి ఒక పత్రికా యజమాని కావడం వెనుక బాబు కరుణ వుందని అందరికీ తెలుసు.
వైఎస్ వచ్చిన తర్వాత తన మీద వస్తున్న అడ్డగోలు వార్తలు భరించలేక అనివార్యంగా సాక్షి పత్రిక పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మీడియా పార్టీల వారీగా చీలిన మాట నిజమే. అయితే దీనికి తొలుత పునాది వేసింది ఎవరు? తాను ఎవరికైతే పొగ పెట్టదలుచుకున్నాడో వాళ్ల మీద వరుసగా కథనాలు రాయించింది ఎవరు? ఎన్టీఆర్ పార్టీనే కాదు, గుర్తును కూడా అక్రమంగా లాక్కుని చిలకపలుకులు పలుకుతున్న చంద్రబాబు ఈ రోజు వ్యవస్థల పతనం గురించి మాట్లాడుతున్నాడు.
ఈ రోజు ఎన్నికలు డబ్బు, మద్యం పారించకపోతే జరగని పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబే కదా! అంతకు ముందు లేవని కాదు, అయితే 96 తర్వాత వరుసగా వచ్చిన ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, క్వార్టర్ బాటిళ్లు, ఓటుకి రేటు ఊరూరా పాపులర్ చేశాడు.
ఎన్టీఆర్ పెట్టిన మద్యనిషేధాన్ని పూర్తిగా నాశనం చేసి ఊరూరా బెల్ట్‌షాపులు పెట్టింది చంద్రబాబే. ప్రత్యర్థుల మీదికి పోలీసుల్ని ఉసిగొల్పడం కూడా బాబు హయాంలోనే స్టార్ట్ అయ్యింది. 90వ దశకంలో వైఎస్ పాపులారిటీ తగ్గించడానికి పోలీసులతో ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టించిన బాబు, ఈ రోజు పోలీసులు నిబద్ధతతో పని చేయాలని స్పీచ్‌లు ఇస్తున్నాడు. వ్యవస్థల పతనానికి ప్రతీక తమరు. మీరు కూడా మాట్లాడితే ఎవరు వింటారు? పవన్‌కి చరిత్ర తెలియదు కాబట్టి వింటాడు.