ముస‌లి పులి- అమాయ‌కుడు

పాత క‌థే, కొత్తేదేం కాదు. వ‌య‌సైపోయిన ఒక ముస‌లి పులి నీళ్ల మ‌డుగులో నుంచి ఒక బాట‌సారిని పిలుస్తుంది. న‌న్ను ఈ నీళ్ల నుంచి బ‌య‌టికి లాగితే నా చేతికి వున్న బంగారు కంక‌ణం…

పాత క‌థే, కొత్తేదేం కాదు. వ‌య‌సైపోయిన ఒక ముస‌లి పులి నీళ్ల మ‌డుగులో నుంచి ఒక బాట‌సారిని పిలుస్తుంది. న‌న్ను ఈ నీళ్ల నుంచి బ‌య‌టికి లాగితే నా చేతికి వున్న బంగారు కంక‌ణం ఇస్తాన‌ని ఆశ పెడుతుంది. బాట‌సారి బంగారం మీద ఆశ‌తో దిగుతాడు. పులి అత‌న్ని తిని బ్రేవ్‌మంటుంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో పులి చంద్ర‌బాబు, బాట‌సారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బంగారు కంక‌ణం క‌థ‌లో వుంది కానీ, ఇక్క‌డ లేదు. అది గ్రాఫిక్స్‌. ఎన్నో గ్రాఫిక్స్ సినిమాల్లో న‌టించినా ప‌వ‌న్ తెలుసుకోలేడు.

ప‌వ‌న్, బాబు భేటీ చూస్తే చ‌రిత్ర తెలిసిన వాళ్ల‌కి చాలా గుర్తొస్తాయి. ఇక్క‌డ చ‌రిత్ర అంటే రాజ‌కీయ చ‌రిత్ర‌కాదు, బాబు చ‌రిత్ర‌. చంద్ర‌బాబు హెరిటేజ్ అనే కూర‌గాయ‌ల షాపు ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయ‌న‌కి క‌రివేపాకు అంటే చాలా ఇష్టం. తాలింపున‌కి వాడి, ప‌క్క‌న ప‌డేస్తాడు. ద‌గ్గుబాటి, హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు సీనియ‌ర్ క‌రివేపాకులు. బాల‌కృష్ణ‌తో బంధుత్వం పెట్టుకుని ప‌ర్మినెంట్‌గా పోటీ లేకుండా చేసుకున్నాడు. ప‌వ‌న్ ఆల్రెడీ ఒక‌సారి క‌రివేపాకు. అయినా రెండోసారి సిద్ధ‌ప‌డ్డాడంటే అమాయ‌కుడు అనాలా?  మూర్ఖుడు అనాలా?

ఎన్టీఆర్‌ని గ‌ద్దె దించిన‌ప్పుడు తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో ఇంతే తీయ‌గా మాట్లాడాడు. అధికారం చెరిస‌గం అన్నాడు. నీతో సంప్ర‌దించ‌కుండా ఏమీ చేయ‌న‌న్నాడు. ప‌వ‌ర్‌లోకి రాగానే అడ్ర‌స్ లేకుండా చేశాడు. మామ‌కి అన్యాయం చేశాడ‌నే శాశ్వ‌త చెడ్డ‌పేరు మాత్రమే ద‌గ్గుబాటికి మిగిలింది. చంద్ర‌బాబుకి పార్టీ, ప‌వ‌ర్ అన్నీ ద‌క్కాయి.

హ‌రికృష్ణ‌ని నెత్తిన పెట్టుకున్నాడు. మంత్రిని చేశాడు. పార్టీలో నీకు ఎదురు లేద‌న్నాడు. మెల్లిగా అధికారాలు క‌త్తిరించి మూల కూచోపెట్టాడు. అమాయ‌కుడు కాబ‌ట్టి పార్టీ పెట్టి హ‌డావుడి చేశాడు. చంద్ర‌బాబు కుటిల నీతికి త‌ట్టుకోలేక రాజ‌కీయ‌మే వ‌దిలేసుకున్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అవ‌స‌రం ప‌డితే ఆప్యాయ‌త కురిపించాడు. తాత‌గారి పార్టీ క‌దా, త‌న‌కీ హ‌క్కు వుంటుంద‌ని జూనియ‌ర్ న‌మ్మాడు. శ‌క్తి మేర‌కు ప్ర‌చారం చేశాడు. ప్ర‌మాదానికి కూడా గుర‌య్యాడు. త‌ర్వాత బాబు త‌త్వం తెలిసింది. లోకేశ్‌కి అడ్డు రాకూడ‌ద‌ని జూనియ‌ర్‌ని మొగ్గ‌లోనే తుంచేశాడు.

వీళ్లంద‌రి కంటే అమాయ‌కుడు ప‌వ‌న్‌. ఒక‌సారి బాబు వాడుకుని వ‌దిలేశాడు. అయినా బుర్ర ప‌నిచేయ‌డం లేదు. చేత‌నైతే, జ‌గ‌న్‌కి దీటైన నాయ‌కుడిగా ఎద‌గాలి. తొమ్మిదేళ్లు పార్టీ నిర్మాణాన్ని గాలికి వ‌దిలి సినిమాలు చేసుకున్నాడు. హ‌ఠాత్తుగా ప్ర‌జాస్వామ్యం, జ‌గ‌న్ నియంతృత్వం అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని కాపాడుతాడట‌! అస‌లైన నియంత‌ని ప‌క్క‌న పెట్టుకుని ఇంకెవ‌రినో నియంత అంటున్నాడు. 

సీట్ల ద‌గ్గ‌ర బాబు అస‌లు స్వ‌రూపం బ‌య‌ట ప‌డుతుంది. అప్ప‌టికీ ప‌వ‌న్ మాట్లాడ‌కుండా కాళ్లు, చేతులు ఎలా క‌ట్టేయాలో బాబుకి తెలుసు. అయినా గ‌త ముఖ్య‌మంత్రిగా ఏమీ చేయ‌ని చంద్ర‌బాబుని మ‌ళ్లీ గెలిపించ‌డానికి ప‌వ‌న్ పార్టీ పెట్ట‌డం దేనికి? ఆ పార్టీలో ఎవ‌రైనా మ‌న‌స్ఫూర్తిగా ప‌ని చేస్తారా? సినిమాల్లో లాగా రాజ‌కీయాల్లో డైరెక్ట్ విల‌న్లు ఉండ‌రు. చంద్ర‌బాబులా మారువేషాల్లో వుంటారు.