తుగ్ల‌క్‌…తుగ్ల‌క్ః నిత్య స్మ‌ర‌ణ‌!

అయిన దానికి, కాని దానికి తెర‌పైకి తుగ్ల‌క్‌ను తేవ‌డం టీడీపీకి ప్యాష‌నైంది. తాము ఏం చెప్పినా జ‌నాలు న‌మ్మేస్తార‌నే అతి విశ్వాస‌మో, లేక ఎలాగైనా న‌మ్మించ‌గ‌ల‌మ‌న్న భ‌రోసానో తెలియ‌దు కానీ…వైఎస్ జ‌గ‌న్‌ను పిచ్చివాడి కింద…

అయిన దానికి, కాని దానికి తెర‌పైకి తుగ్ల‌క్‌ను తేవ‌డం టీడీపీకి ప్యాష‌నైంది. తాము ఏం చెప్పినా జ‌నాలు న‌మ్మేస్తార‌నే అతి విశ్వాస‌మో, లేక ఎలాగైనా న‌మ్మించ‌గ‌ల‌మ‌న్న భ‌రోసానో తెలియ‌దు కానీ…వైఎస్ జ‌గ‌న్‌ను పిచ్చివాడి కింద క‌ట్టేసేందుకు ఎల్లో గ్యాంగ్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఈ ప్ర‌య‌త్నంలో తామే పిచ్చివాళ్లు అవుతున్న సంగ‌తిని వాళ్లు గుర్తిస్తున్న‌ట్టు లేదు.

చంద్ర‌బాబు భ‌క్తుడైన ఓ మీడియా అధిప‌తి ఏకంగా నారా లోకేశ్‌ను ముందుకు తెస్తే అంతే సంగ‌తుల‌ని రాసుకొచ్చారు. త‌మ‌కు న‌చ్చ‌ని నాయ‌కుల్ని పిచ్చి వాళ్ల‌ను చేయాల‌నుకుని, చివరికి తామే అలా అవుతున్నార‌నేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఏదైనా అతి మంచిది కాదని పెద్ద‌లు చెబుతారు.

జ‌గ‌న్ ప‌రిపాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎల్లో బ్యాచ్ త‌మ నోటికి తుగ్ల‌క్‌ను అంటించుకుంది. నిత్యం తుగ్ల‌క్ స్మ‌ర‌ణ చేస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థులు పోటీ చేయ‌క‌పోయినా… తుగ్ల‌క్ పాల‌నే కార‌ణం. ట్విట‌ర్‌తో త‌ప్ప జ‌నంతో సంబంధం లేని మ‌రో పెద్ద నాయ‌కుడైన లోకేశ్ కాస్త ముందుకెళ్లి జ‌గ‌న్‌ను జ‌గ్ల‌క్‌రెడ్డి అని సంబోధించి త‌న ఓర్వ‌లేనిత‌నాన్ని, అక్క‌సును బ‌య‌ట పెట్టుకున్నారు.

రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రాష్ట్రంలో తుగ్ల‌క్ పాల‌న న‌డుస్తోంద‌ని విమ‌ర్శించారు. అందుకే దీపావ‌ళి పండ‌గ రోజు నామినేష‌న్ల కార్య‌క్ర‌మాన్ని పెట్టార‌ని విమ‌ర్శించారు. తాజాగా పెట్రోల్ ధ‌ర‌ల‌పై చంద్ర‌బాబు మాట్లాడుతూ అదే విమ‌ర్శ చేయ‌డం గ‌మ‌నార్హం. జగన్‌ది తుగ్లక్‌ పాలన కాక మరేమిటి? అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని ప్ర‌శ్నించారు. 

ఇంత‌కూ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల అదుపు ఎవ‌రి చేతుల్లో వుంటుందో తెలియ‌క‌నే చంద్రబాబు నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేస్తున్నారా? ఏవేవో మాట్లాడుతూ చివ‌ర‌కు త‌మ‌ను జ‌నం పిచ్చివాళ్ల‌ని జ‌మ క‌ట్టే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌ని ఆశిద్దాం.