ఆర్టీసీ బస్సుల్లో కూడా రిజర్వేషన్ చార్ట్ చూసుకున్నాకే డ్రైవర్ బస్ స్టార్ట్ చేస్తాడు. ఏ ఒక్కరు రాకపోయినా ఫోన్లు చేసి పిలుస్తారు. మరి విమానాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పోనీ టేకాఫ్ టైమ్ దాటిపోయి వచ్చినవారిని వదిలేద్దాం. కనీసం ముందుగా వచ్చి వేచి చూస్తున్నవారినయినా ఎక్కించుకోవాలి కదా. కానీ గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ మాత్రం ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే బయలుదేరింది. విమానం ఎప్పుడొస్తుందా అని ఎదురు చేస్తున్నవారికి నరకం చూపించింది. చివరకు చావు కబురు చల్లగా తెలిసింది, తమను ఎక్కించుకోకుండానే విమానం ఎగిరిపోయిందని తెలుసుకున్న ప్రయాణికులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు.
విమానాలు ఆలస్యం కావడం, ప్రయాణికులు ఇబ్బంది పడటం, ఆ తర్వాత ప్రత్యామ్నాయం చూసి వారిని వేరే ఫ్లైట్స్ లో పంపించేయడం పరిపాటే. కానీ ఇక్కడ గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ మాత్రం మరో రకంగా ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టింది. ఎయిర్ పోర్ట్ లో ఎదురు చూస్తున్నవారిని ఎక్కించుకోకుండానే ఎగిరిపోయింది. ఈ ఘటన బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో జరిగింది.
ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్ వేస్ విమానం (G8 116) 54మంది ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే బయలుదేరింది. పోనీ వారంతా ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కి వచ్చారా అంటే అదీ లేదు, గంటల తరబడి ఎయిర్ పోర్ట్ లో వేచి చూశారు, చివరకు విమానం వెళ్లిపోయిందని తెలిసి కంగారు పడ్డారు, గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ యాజమాన్యాన్ని చెడామడా తిడుతూ ట్విట్టర్లో పోస్టింగ్ లు పెట్టారు.
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణికుల్ని ఎక్కించేందుకు బోర్డింగ్ పాయింట్ నుంచి మినీ బస్సుల్లో నాలుగు బృందాల్ని పంపించారు. మూడో బస్సు వెళ్లినా వారిని ఎక్కించుకోవడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఉదయం 6.30 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా, ప్రయాణికులు 5.35 గంటలకు బస్సు ఎక్కారు. అయితే గంటసేపు అందులోనే వారు వేచి చూశారు. తీరా విమానం వెళ్లిపోయిందని తెలిశాక తిట్టుకుంటూ బయటకు దిగారు.
ప్రయాణికులంతా వెంటనే ట్విట్టర్లో ఆ ఎయిర్ లైన్స్ ని ట్యాగ్ చేస్తూ పోస్టింగ్ లు పెట్టారు. పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. విమానయాన సంస్థ దిగొచ్చింది. ఫ్లైట్ మిస్ అయినవారికి ఉదయం 10గంటలకు వేరే విమానం ఏర్పాటు చేసింది. కానీ ఢిల్లీలో అత్యవసర మీటింగ్ లకు వెళ్లాల్సిన వారు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. తమ పనులన్నీ ఆగిపోయాయని బాధపడ్డారు.