మొత్తానికి సంక్రాంతి థియేటర్ల వివాదం పూర్తిగా కాదు కానీ కొద్దిగా సద్దు మణిగింది. 12న విడుదలవుతున్న బాలయ్య వీరసింహారెడ్డికి సోలో రిలీజ్ దక్కింది. దీని వల్ల తొలి రోజు మంచి ఓపెనింగ్ ఫిగర్ కనిపించే అవకాశం వుంది. మలి రోజు విడుదలవుతోంది వాల్తేర్ వీరయ్య. ఎంత కాదన్నా థియేటర్లు షేర్ చేసుకోవాల్సిందే. అందువల్ల ఓపెనింగ్ ఫిగర్ ఎలా వుంటుంది అన్నది చూడాలి.
వారసుడు వెనక్కు వెళ్లినంత మాత్రాన పెద్దగా సంతోషించాల్సినంత సీన్ లేదు. ఎందుకంటే జస్ట్ రెండు రోజులు మాత్రమే గ్యాప్. దీని వల్ల బాలయ్యకు సోలో ఓపెనింగ్. మెగా సినిమాకు ఫిఫ్టీ పర్సంట్ ఓపెనింగ్ వుంటుంది. మర్నాటి నుంచి ఎవరి సినిమా బాగుంటే వారి సినిమాకే కలెక్షన్ లేదా పండగ కాబట్టి రెండు మూడు రోజులు అన్ని సినిమాలు ఫుల్స్ బోర్డులు కనిపించే అవకాశం వుంది.
వాస్తవానికి సీనియర్ హీరోలు, అది ఎవరైనా సరే, వారి సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ప్రచారంలో, ఇండస్ట్రీలో వున్నంత హడావుడి జనాల్లో వుందా అన్నది అనుమానమే. బెంగళూరులో కౌంటర్లు ఓపెన్ చేసినా, ఇంకా బుకింగ్ లు జోరు అందుకోలేదు. తెలుగునాట ఇంకా ఓపెన్ కాలేదు. నిజానికి రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్ల మాంచి పోటీ వచ్చి, సినిమాకు రావాల్సిన దాని కన్నా మంచి ఎక్కువ బజ్ వస్తోంది. అది చాలా వరకు ప్లస్ అయింది.
పండగ సీజన్ కనుక మంచి వసూళ్లు కూడా వుండే అవకాశం వుంది. ఏ సినిమా అయినా టాక్ తో సంబంధం లేకుండా తొలివారం వసూళ్లు అయితే వుంటాయి. మలి వారం మాత్రం సినిమా క్వాలిటీ మీదే డిపెండ్ అవుతుంది. బయ్యర్ల సేఫ్ కూడా అప్పుడే తేలుతుంది.