4 ఏళ్ల ప్రజాసంకల్పం.. జగన్ లో వచ్చిన మార్పులేంటి?

ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్ అందరితోనూ కలసిపోయారు, అందరూ ఆయన్ని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మొదలైన ప్రజా సంకల్ప యాత్ర నిరాటంకంగా 341 రోజుల పాటు కొనసాగడానికి, జగన్…

ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్ అందరితోనూ కలసిపోయారు, అందరూ ఆయన్ని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మొదలైన ప్రజా సంకల్ప యాత్ర నిరాటంకంగా 341 రోజుల పాటు కొనసాగడానికి, జగన్ ఏకబిగిన 3648 కిలోమీటర్లు యాత్ర చేయడానికి అదే ప్రధాన కారణం. 

జగన్ జనంలో ఉండబట్టే ఆయన యాత్ర అంత సక్సెస్ అయింది. అదే జగన్ వ్యాన్ లోనో, బస్సులోనే.. చేతులూపుతూ వెళ్లి ఉంటే.. యాత్ర గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు.

నాలుగేళ్ల తర్వాత ప్రజా సంకల్ప యాత్రను గుర్తు తెచ్చుకుంటే.. జగన్ అప్పుడెలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారనే చర్చ రాకమానదు. అప్పుడు జగన్ ని కలవాలంటే ఎవ్వరి పర్మిషన్ అవసరమయ్యేది కాదు, ఇప్పుడు జగన్ అపాయింట్ మెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా కష్టమేనని అంటున్నారు. 

అప్పుడు నేరుగా ఎవరైనా జగన్ కి తమ బాధలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడక్కడా సెల్ఫీ వీడియోల రూపంలో మాత్రమే బాధలు సీఎం వరకు వెళ్తున్నాయి.

నిత్యం సమీక్షలతో కుస్తీ పడుతున్న జగన్ కి జనాన్ని కలవడం కష్టంగా మారింది. ఆయన వైఖరిలో మార్పు రాలేదు కానీ, ఆయన స్థానంలో వచ్చిన మార్పు జనానికి జగన్ ని దూరం చేసింది. రచ్చబండ మహూర్తాలు మారిపోతున్నాయి కానీ, జగన్ జనంలోకి వచ్చే దారి కనపడ్డంలేదు. 

అదిగో వస్తున్నారు, ఇదిగో వస్తున్నారని చెబుతున్నారే కానీ.. ఎప్పుడొస్తారో ఎవరికీ తెలియదు. అప్పటి ప్రజా సంకల్ప యాత్రతో జనం కష్టాలు తెలుసుకున్న జగన్, ఇప్పుడు రచ్చబండతో అవి ఎంతమేర తీరాయో కూడా ఓ అంచనాకు రావాలి. ఎన్నికలకు ముందు తప్పొప్పులు సరిదిద్దుకునేందుకు జగన్ సమయం తీసుకోవాలి.

జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ప్రజా సంకల్ప యాత్రకు అర్థం అయితే.. జగన్ పాలనలో జనం ఎలా ఉన్నారని నేరుగా తెలుసుకోవడం ఆ యాత్రకు పరమార్థం అవుతుంది.