ప్రభాస్..పవన్..ఎవ్వరూ ‘తగ్గేదే లే’

టాలీవుడ్ లో సంక్రాంతి విడుదల రాజకీయాలు షురూ అయిపోయాయి. ప్రతి ఏటా ఇది మామూలే. ముందుగానే థియేటర్లు బ్లాక్ చేసేయడం, థియేటర్లు దొరకవు అని చెప్పి వేరే సినిమాలను వెనక్క నెట్టించి, తమ సినిమాలే…

టాలీవుడ్ లో సంక్రాంతి విడుదల రాజకీయాలు షురూ అయిపోయాయి. ప్రతి ఏటా ఇది మామూలే. ముందుగానే థియేటర్లు బ్లాక్ చేసేయడం, థియేటర్లు దొరకవు అని చెప్పి వేరే సినిమాలను వెనక్క నెట్టించి, తమ సినిమాలే ఆడేలా చేసి, డబ్బు చేసుకోవడం కామన్ అయిపోయింది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు షురూ అయిపోయాయని తెలుస్తోంది.

అయితే ఇటు ప్రభాస్, అటు పవన్ సినిమాలు వుండడంతో రాజకీయం కాస్త రంజుగా వుండే అవకాశం వుంది. గోదావరి జిల్లాల్లో పవన్ ఫ్యాన్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య పోటా పోటీగా వుంటుంది. ఇప్పటికే ఇద్దరి సినిమాలు డేట్ లు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరు తగ్గినా ఫ్యాన్స్ కు నామర్దాగా వుంటుంది. 

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రభాస్ సినిమా పండగకు కచ్చితంగా విడుదలై తీరాలి. దాని బడ్జెట్, దానికి వున్న భారాలు అలాంటివి. పైగా ఆర్ఆర్ఆర్, రాధేశ్వామ్ రెండూ నైజాంలో దిల్ రాజే విడుదల చేస్తున్నారు. రాధేశ్యామ్ వైజాగ్ కూడా ఆయనే. ఇక భీమ్లా నాయక్ సినిమా కూడా ఆయనే చేసే అవకాశం వుంది. రెగ్యులర్ ఫార్మాట్ ప్రకారం.

అయితే ఆర్ఆర్ఆర్ మీద 70 కోట్లు, రాధేశ్యామ్ మీద 70 కోట్లు మొత్తం 140 కోట్ల మేరకు దిల్ రాజు వెనక్కు తెచ్చుకోవాలి. ఈ రెండూ పక్కా. ఇలాంటి టైమ్ లో భీమ్లా నాయక్ కూడా లైన్ లోకి వస్తే దిల్ రాజుకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వచ్చినా భీమ్లా నాయక్ తనదే. అందువల్ల ఆ సినిమా వెనక్కు వెళ్తేనే దిల్ రాజుకు బెటర్. 

అలా కాకుండా భీమ్లా నాయక్ కూడా బరిలో దిగితే ఆర్ఆర్ఆర్ మాటేమో కానీ రాధేశ్వామ్ మీద రావాల్సిన 70 కోట్ల మేరకు రావడం కష్టం కావచ్చు. అందుకే ఇప్పుడు భీమ్లా విడుదల ఆపాల్సిన అవసరం వుంది. కానీ ఇది ఎవరి చేతిలో లేదు. పవన్ కళ్యాణ్ ను కాంట్రాక్టు చేస్తే తప్ప అది సాధ్యం కాదు. కానీ నేరుగా పవన్ ను వెళ్లి సినిమా వాయిదా వేయమని అడిగేంత సీన్ వుండదు.

అందుకే నిర్మాత వైపు నుంచే నరుక్కు రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ తో వ్యవహారం మామూలుగా వుండదు. ఇప్పటికే పుష్ప విషయంలో మైత్రీ సంస్థ ను ఫ్యాన్స్ ట్విట్టర్ లో మామూలుగా ట్రోల్ చేయడం లేదు. ఇక భీమ్లా వెనకంజ వేస్తే హారిక హాసిని కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. 

పండగ సినిమాలకు రేట్లు తేవాలని, వస్తాయనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అందువల్ల రేట్లు వస్తే అదే టైమ్ లో పవన్ సినిమా వేస్తే బెటర్. లేదూ అంటే తరువాత ఎప్పుడయినా వేస్తే ఏ మూల నుంచి అయినా ఇబ్బందులు వస్తే ఆదుకునేవారు వుండరు. 

ఇవన్నీ ఇలా వుంచితే పండగకు ఓ మిడ్ రేంజ్ సినిమాకూ చాన్స్ వుంటుంది. నాగార్జున బంగార్రాజు ఆ చాన్స్ తీసుకోవాలనుకుంటోంది. ఇదే సమయంలో దిల్ రాజు ఆ చాన్స్ కూడా తానే తీసుకునే ఆలోచన చేస్తున్నారనే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

తమ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఆశిష్ రెడ్డి హీరోగా నిర్మించిన రౌడీ బాయిస్ సినిమా విడుదలను ఆయన పక్కన పెట్టారు. ఏమాత్రం అవకాశం వున్నా సంక్రాంతి ఎండింగ్ డేట్స్ లో దాన్ని బరిలోకి దింపాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు అన్నీ పవన్ ఫ్యాన్స్ ను చికాకు పెడుతున్నాయి. ఇవన్నీ హీరో దృష్టికి ఎలా తీసుకెళ్లాలా అని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా పవన్ తో మరో సినిమా అనిల్ రావిపూడి డైరక్షన్ లో చేయాలని అనుకుంటున్న నిర్మాత దిల్ రాజే భీమ్లా నాయక్ కు అడ్డం పడుతున్నారన్న వార్తలు వారికి మింగుడు పడడం లేదు.