“సోమాలియా నుండి 500 టన్నుల అరటిపండ్లు మార్కెట్లోకి వచ్చాయి, ఇందులో హెలికోబాక్టర్ అనే పురుగు ఉంది, ఇది కడుపులో విషపూరిత అరటిని విడుదల చేస్తుంది, ఇది విరేచనాలు, వాంతులు, వికారం, తలనొప్పి లాంటి లక్షణాల్ని చూపుతుంది. 12 గంటల తర్వాత వ్యక్తి చనిపోతాడు.”
సోషల్ మీడియాలో జోరుగా సర్కులేట్ అవుతున్న సమాచారం ఇది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. అరటి పండును ఒలిస్తే అందులోంచి 2 పెద్ద పురుగులు వచ్చిన వీడియో ఇది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు అరటిపండు తినాలా వద్దా? ఈ వాట్సాప్ ఫార్వార్డ్ లో నిజం ఎంత అనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
నిజం ఏంటంటే.. ఈ వాట్సాప్ వీడియోలో, దానికి అనుబంధంగా వస్తున్న సమాచారంలో ఎలాంటి నిజం లేదు. భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ (FSSAI)దీనిపై వివరణ ఇచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న వీడియో ఇండియాకు సంబంధించినది కాదని సంస్థ ప్రకటించింది. పైగా వీడియోలో చెబుతన్నట్టు హెలికోబాక్టర్ అనేది పురుగు కాదని, అదొక బ్యాక్టీరియా అని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక్కడే మరో చిన్న లాజిక్ కూడా చెబుతున్నారు అధికారులు. సోమాలియా నుంచి 500 టన్నుల అరటిపండ్లు ఇండియాకు దిగుమతి అయ్యాయంటూ వచ్చిన స్టేట్ మెంట్ లోనే నిజం లేదంటున్నారు. ఎందుకంటే, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చూసుకుంటే, ప్రపంచంలోనే అత్యథికంగా అరటిపంటను సాగుచేస్తున్న దేశం భారతదేశం. 2010-17 మధ్యకాలంలో ఏటా 29 మిలియన్ టన్నుల అరటిని ఇండియాలో సాగుచేశారు. కాబట్టి ఇండియా లాంటి దేశం, సోమాలియా నుంచి కేవలం 500 టన్నుల అరటిపండ్లను దిగుమతి చేసుకుందనే వార్తలో అర్థం లేదు.
ఇదే విషయాన్ని దుబాయ్ ఆహార భద్రత సంస్థ కూడా నిర్థారించింది. ఆ వీడియో తమ దేశానికి చెందినది కూడా కాదని, అందులో నిజం లేదని ప్రకటించింది. పర్షియన్, అరేబియన్, ఫ్రెంచ్ భాషలతో పాటు చాలా భాషల్లో డబ్బింగ్ చేసి మరీ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని, ఇలాంటి వీడియోలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.