అక్క‌డ జ‌న‌సేన‌లో జోష్‌…టీడీపీలో వైరాగ్యం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అధికారికంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఖ‌రారు కావ‌డం ఒక్క‌టే మిగిలింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పొత్తుల‌పై…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అధికారికంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఖ‌రారు కావ‌డం ఒక్క‌టే మిగిలింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పొత్తుల‌పై మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందిస్తూ… త‌మ‌కంటూ వ్యూహాలున్నాయ‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. వ్యూహాలే ఏ పార్టీనైనా ముందుకు న‌డిపించేది.

బాబు, ప‌వ‌న్ భేటీ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన ఎన్నెన్ని సీట్ల‌లో పోటీ చేస్తాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. టీడీపీ, జ‌న‌సేన పార్టీలు  అసెంబ్లీ, లోక్‌స‌భ సీట్లను ఏ విధంగా పంచుకుంటాయో ఎవ‌రికి వారు లెక్క‌లేసుకుంటున్నారు. టీడీపీ అత్య‌ధిక స్థానాల్లో పోటీ చేస్తుంద‌నేది అంద‌రి వాద‌న‌. కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్న‌చోట మాత్రం జ‌న‌సేన బ‌రిలో వుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి జ‌న‌సేన‌లో జోష్ క‌నిపిస్తోంది. ఈ సీటు త‌మ‌కే ప‌క్కా అని జ‌న‌సేన నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. బాబుతో ప‌వ‌న్ భేటీపై వైసీపీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు దిగ‌డంతో, తిరుప‌తిలో అధికార పార్టీపై జ‌న‌సేన నాయ‌కులు ఎదురు దాడికి దిగ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. పొత్తులో భాగంగా టీడీపీ మ‌ద్ద‌తుతో బ‌రిలో నిలిస్తే…ఏమో గుర్రం ఎగ‌రా వ‌చ్చ‌నే ఆశ తిరుప‌తి జ‌న‌సేన‌లో వుంది.

తిరుప‌తిలో బ‌లిజ‌లు బ‌లంగా ఉన్నారు. స‌హ‌జంగా పార్టీ అధినేత సామాజిక‌వ‌ర్గాన్ని అనుస‌రించి… అది ఫ‌లానా వాళ్ల పార్టీ అని చెబుతుంటారు. జ‌న‌సేనాని ప‌వన్ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. తిరుప‌తి మెజార్టీ బ‌లిజ‌లు ప‌వ‌న్‌లో త‌మ నాయకుడిని చూసుకుంటున్నారు. తిరుప‌తిలో వైసీపీకి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్ నేతృత్వంలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం వుంది. దీంతో బ‌లిజ‌ల‌కు టీడీపీ ప్ర‌త్యామ్నాయ పార్టీ అయ్యింది.

కానీ అధినేతే త‌మ వాడైన ప‌వ‌న్ ఉండ‌గా, టీడీపీని అంటిపెట్టుకుని వుండాల్సిన ఖ‌ర్మ మాకేంట‌ని తిరుప‌తి బ‌లిజ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తిరుప‌తి జ‌న‌సేన‌కు మొద‌టి నుంచి కిర‌ణ్ రాయ‌ల్‌, పసుపులేటి హ‌రిప్ర‌సాద్‌, రాజారెడ్డి అండ‌గా ఉంటున్నారు. పొత్తులో భాగంగా తిరుప‌తి సీటు జ‌న‌సేన‌కు త‌ప్ప‌క ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో… టీడీపీ నేత వూకా విజ‌య్‌కుమార్ ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. జ‌న‌సేన‌తో టీడీపీకి పొత్తు వుంటుంద‌ని ముందే గ్ర‌హించిన వూకా విజ‌య్‌కుమార్‌… పాత పీఆర్పీ నేత‌ల‌తో ఆ మ‌ధ్య ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. జ‌న‌సేన నుంచి బ‌రిలో దిగే వ్యూహంలో భాగంగానే వూకా… వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇదిలా వుండ‌గా జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల తాము సీటు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని తిరుప‌తి టీడీపీ నాయ‌క‌త్వం నైరాశ్యానికి లోన‌వుతోంది. ప్ర‌తిప‌క్షంలో వుంటూ క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చుకుంటూ టీడీపీ జెండా మోస్తున్నామ‌ని, పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయా ల్సి వ‌స్తే త‌మ భ‌విష్య‌త్ ఏంట‌ని మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, తుడా మాజీ చైర్మ‌న్ న‌ర‌సింహ‌యాద‌వ్ త‌దిత‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌ని, వైసీపీ దెబ్బ‌కు జ‌న‌సేన త‌ట్టుకోలేద‌నే కొత్త వాద‌న‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌లు తెర‌పైకి తెస్తున్నారు.

ఈ వాద‌న‌ను తిరుప‌తి జ‌న‌సేన కొట్టి పారేస్తోంది. కిర‌ణ్‌రాయ‌ల్‌, ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ లాంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వం జ‌న‌సేన‌కు వుంద‌ని, తాము బ‌రిలో వుంటే, ప్ర‌త్య‌ర్థులు ప‌రార్ కావాల్సి వుంటుంద‌ని ప‌వ‌న్ పార్టీ నేత‌లు ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు. మొత్తానికి బాబు, ప‌వ‌న్ భేటీ తిరుప‌తిలో కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు దారి తీయ‌నుంది.