వారసుడు ట్రయిలర్ ఇలా వచ్చిందో లేదో అలా మీమ్స్ రెడీ అయిపోయాయి. తెలుగులో అప్పటికే వచ్చిన అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు.. ఇలా ఎన్నో సినిమాల ఛాయలు వారసుడు సినిమా ట్రయిలర్ లో కనిపించాయి. ఈ కామెంట్స్, మీమ్స్ దిల్ రాజు వరకు వెళ్లాయి
వారసుడు ట్రయిలర్ పై వచ్చిన కామెంట్స్ పై దిల్ రాజు నేరుగా స్పందించాడు. ట్రయిలర్ చూసిన తర్వాత అందరికీ ఆ ఫీలింగ్ వచ్చిందని, కానీ తనకు కథ విన్న మొదటి రోజే ఆ ఫీలింగ్ వచ్చిందని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు.
“కొన్ని తెలుగు సినిమాల్ని కలిపి వారసుడు ట్రయిలర్ కట్ చేసినట్టుందనే అభిప్రాయం చాలామందికి ఉంది. మీకు ట్రయిలర్ తో ఆ అభిప్రాయం వచ్చింది. నాకు కథ ఓకే చేసినప్పుడే ఆ అనుమానం వచ్చింది. కథ నెరేషన్ టైమ్ లోనే నాకు ఈ అనుమానాలన్నీ ఉన్నాయి. కానీ వారసుడులో ఓ కొత్త పాయింట్ ఉంది. అది కనెక్ట్ అవుతుంది.”
ఓ ఫ్యామిలీ కథ చెప్పినప్పుడు కొన్ని పాత సినిమాలు గుర్తుకురావడం సహజమని, టోటల్ గా సినిమా చూసినప్పుడు ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా అనేది ముఖ్యమని అంటున్నాడు దిల్ రాజు. శతమానంభవతి సినిమా టైమ్ లో కూడా టీవీ సీరియల్ లా ఉందని విమర్శలొచ్చాయని, కట్ చేస్తే దానికి జాతీయ అవార్డ్ వచ్చిందన్నారు.
పైగా సినిమాకు సంబంధించి అన్నీ ట్రయిలర్ లో చూపించలేమని.. రెండున్నర గంటల సినిమా చూసి అప్పుడు మాట్లాడాలని కోరుతున్నాడు దిల్ రాజు. ట్రయిలర్ తో సినిమా రిజల్ట్ డిసైడ్ అవ్వదని, కాబట్టి వారసుడు ట్రయిలర్ పై వచ్చిన కామెంట్స్ ను పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డాడు.