టీడీపీకి కుప్పం, వైసీపీకి నెల్లూరు టెన్ష‌న్‌!

గ‌తంలో వివిధ కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా మిగిలిపోయిన స్థానిక సంస్థ‌ల‌కు మ‌రో ప‌ది రోజుల్లో కొత్త పాల‌కులు రానున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,…

గ‌తంలో వివిధ కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా మిగిలిపోయిన స్థానిక సంస్థ‌ల‌కు మ‌రో ప‌ది రోజుల్లో కొత్త పాల‌కులు రానున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స‌ర్పంచ్ స్థానాల‌కు  ఈ నెల 14,15,16 తేదీల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా నిన్న‌టితో ముగిసింది. ఇక ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఉప పోరు కావ‌డంతో రాజ‌కీయ పార్టీల‌న్నీ గ‌ట్టిగా త‌ల‌ప‌డుతున్నాయి.

వీటిలో ప్ర‌ధానంగా కుప్పం, నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో అక్క‌డి ఎన్నిక‌లు టీడీపీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌య్యాయి. 

ఇక నెల్లూరు కార్పొరేష‌న్ విష‌యానికి వ‌స్తే మంత్రి అనిల్‌కుమార్ అక్క‌డి నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. దీంతో ఇక్క‌డి ఎన్నిక‌లను వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కుప్పంలో టీడీపీకి, నెల్లూరులో వైసీపీకి టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు.

నెల్లూరు కార్పొరేష‌న్‌లో 54 డివిజ‌న్లు ఉన్నాయి. ఇక్క‌డ‌ 4,92,074 ఓట‌ర్లున్నారు. అలాగే కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. దాదాపు 40 వేల మంది ఓట‌ర్లు ఉన్నారు. నెల్లూరులో ఏ మాత్రం ఫ‌లితం తేడా వ‌చ్చినా…. గ‌తంలో స్థానిక సంస్థ‌ల్లో ఎన్నిక‌ల్లో సాధించిన ఏక‌ప‌క్ష విజ‌యాల‌పై ప‌డుతుంద‌ని వైసీపీ ఆందోళ‌న చెందుతోంది. 

కావున ఎలాగైనా నెల్లూరులో గ‌రిష్టంగా అన్ని డివిజ‌న్ల‌లో గెలుపొందాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ ఉంది. ఇదే స‌మ‌యంలో వైసీపీ విజ‌యాల‌కు అడ్డు క‌ట్ట వేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ ఉంది.

ఇక కుప్పం విష‌యానికి వ‌స్తే నెల్లూరు ఓట‌ర్ల‌తో పోల్చితే ప‌దో వంతే అయిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబు కార‌ణంగా ఇక్క‌డి ఫ‌లితంపై ఉత్కంఠ నెల‌కుంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను చావుబ‌తుకుల స‌మ‌స్య‌గా టీడీపీ భావిస్తోంది. మ‌రి కుప్పం ప్ర‌జ‌లు తుది తీర్పు ఏంటో తెలియాలంటే మ‌రో ప‌ది రోజులు ఆగాల్సిందే.