వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సొంత జిల్లా షాక్ ఇచ్చింది. తమ అభిప్రాయాన్ని గౌరవించకుండా ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడాన్ని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని రెండు గ్రామాల ప్రజలు జీర్ణించుకో లేకున్నారు.
తమ నిరసనను, ఆగ్రహాన్ని ఎన్నికల బహిష్కరణతో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది ఒక రకంగా పాలకుడైన తమ సొంత జిల్లా నాయకుడిపై ప్రజల ధిక్కరణ స్వరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని ఓబన్నపేట, సుగుమంచిపల్లె-1, సుగుమంచిపల్లె-2, సుగుమంచిపల్లె గ్రామ సర్పంచితో పాటు 14 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఇది రెండోసారి నోటిఫికేషన్ ఇవ్వడం. ఇవి గండికోట జలాశయం ముంపు పరివాహక ప్రాంతాలు. కానీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఈ పల్లె వాసులు ముందుకు రాలేదు.
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తమ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసిందనే ఆగ్రహం సుగుమంచిపల్లె, ఓబన్నపేట గ్రామ వాసుల్లో కనిపిస్తోంది. దీంతో తమ నిరసనను ఎన్నికల బహిష్కరణ ద్వారా చాటి చెప్పారు. సీఎం సొంత జిల్లాలో ఈ రకమైన నిరసన వ్యక్తం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిన్న సాయంత్రం ఐదు గంటల వరకూ నామినేషన్ల దాఖలుకు గడువువున్నా… ఏ ఒక్కరూ ముందు రాకపోవడం విశేషం. ఇలా రెండోసారి కూడా ఎన్నికలను బహిష్కరించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కళ్లప్పగించి చూస్తూ వుండిపోవడంతో తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే ఏమవుతుందో…ఆ పల్లె వాసులు తమ బహిష్కరణతో హెచ్చరించారు.