గీతా సంస్థ అంటే దిల్ రాజు కు అత్యంత సన్నిహితం. బన్నీ వాస్ కు దిల్ రాజుకు వ్యాపార భాగస్వామ్యాలు కూడా వున్నాయి. అలాంటి బన్నీ వాస్ నే ఇప్పుడు దిల్ రాజు వైఖరికి నివ్వెరపోతున్నారు. దిల్ రాజు ఇలా ఎందుకు చేస్తున్నారా? అని కిందా మీదా అవుతున్నారు. అలాగే హారిక చినబాబు అంటే తనకు ఎంతో సన్నిహితం అంటారు దిల్ రాజు. ఇప్పుడు ఆ బ్యానర్ కూడా దిల్ రాజు వైఖరితో కిందా మీదా అవుతోంది.
విషయం ఏమిటంటే ఫిబ్రవరి 17న తమ సినిమాల విడుదల ప్రకటించాయి గీతా2, సితార సంస్థలు. వినరో భాగ్యము విష్ణు కథ, సర్ సినిమాలు ఆ రోజు విడుదలకు వున్నాయి. ఇది చాలా ముందుగా జరిగిన విషయం. కానీ ఉన్నట్లుండి దిల్ రాజు తన సినిమా శాకుంతలం ను అదే డేట్ కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది నిజంగా షాక్ నే. గిల్డ్ పెద్దగా దిల్ రాజు చేయాల్సిన పని కాదు. కూర్చోవాలి. డేట్ ల గురించి మాట్లాడాలి. ఇలాంటి సుద్దులు అనేకం గతంలోని గిల్డ్ మీటింగ్ ల్లో చెప్పిన దిల్ రాజు ఇలా చేయడం చూసి, అసలు గిల్డ్ వుందా..దుకాణం మూసేసారా? అని గిల్డ్ సభ్యులే ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా వుంటే దిల్ రాజు మళ్లీ మరోసారి బన్నీవాస్ కు షాక్ ఇచ్చారు. బన్నీవాస్ తన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ ను 9న విడుదల చేయాలనుకున్నారు. అది ముందుగానే ప్రకటించారు. ఇప్పుడు అదే రోజు శాకుంతలం ట్రయిలర్ విడుదల కార్యక్రమాన్ని ఫిక్స్ చేసారు దిల్ రాజు. దీంతో చేసేది లేక బన్నీ వాస్ తన సినిమా టీజర్ కార్యక్రమాన్ని 10 వ తేదీకి వాయిదా వేసుకున్నారు.
పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, ఇది వ్యాపారం అన్నా, ఇండస్ట్రీ అన్నాక కాస్తయినా సంబంధాలు వుండాలి. కానీ దిల్ రాజు మొండిగా ఆ సంబంధాలు అన్నీ తెగ గొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సుధాకర్, అశ్వనీదత్, మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఒక్కొక్కటీ దిల్ రాజుకు దూరంగా వుంటున్నాయి. ఇక సితార, హారిక హాసిని, గీతా 2 ఇలా మిగిలినవి కూడా దూరం అయితే ఎలా వుంటుందో?
బన్నీతో సినిమా తీస్తా అనే దిల్ రాజు, బన్నీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్నీవాస్ ను హర్డ్ చేసి ఏం సాధిస్తారు అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.