మ‌రోసారి ఎన్నిక‌ల‌ను అడ్డుకునే కుట్ర‌!

స‌వాల్ విస‌ర‌డం, ప‌త్తా లేకుండా పోవ‌డం టీడీపీకి అల‌వాటుగా మారింది. అధికారం లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని టీడీపీ నేత‌ల మాన‌సిక స్థితిని వారి మాట‌లే ప్ర‌తిబింబిస్తున్నాయి. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ…

స‌వాల్ విస‌ర‌డం, ప‌త్తా లేకుండా పోవ‌డం టీడీపీకి అల‌వాటుగా మారింది. అధికారం లేకుండా ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేని టీడీపీ నేత‌ల మాన‌సిక స్థితిని వారి మాట‌లే ప్ర‌తిబింబిస్తున్నాయి. అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు.

ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైసీపీ గెల‌వ‌లేద‌ని బాబు అన్నారు. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలిల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. గతంలో ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేసేలా వ్యవహరించార‌ని విమ‌ర్శించారు. ఉన్మాదులు తప్ప ఎవరూ చేయని రీతిలో దారుణాలకు పాల్పడ్డారని విరుచుకుప‌డ్డారు.  

ద‌మ్ముంటే ఎన్నిక‌ల‌కు రావాల‌ని టీడీపీ స‌వాల్ విస‌ర‌డం, ఆ త‌ర్వాత ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి ప‌లాయ‌నం చిత్త‌గించ‌డాన్ని అంద‌రూ చూశాం. ఏకంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌నే బ‌హిష్క‌రించిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో టీడీపీ స‌త్తా ఏంటో చూశాం. ఇటీవ‌ల బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థిని కూడా నిలిపి చివ‌రికి ఏదో సాకుతో ఎన్నిక‌ల బ‌రి నుంచి పారిపోయింద‌నే చ‌రిత్ర‌ను టీడీపీ మూట‌క‌ట్టుకుంది.

ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవాల‌ని వైసీపీ కోర‌కుండానే త‌ప్పుకోవ‌డం ద్వారా టీడీపీ ఎలాంటి సంకేతాలు పంపింది? ఎలాగూ ఓడిపోయే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌డం దేనిక‌నే క‌దా అని సొంత పార్టీ శ్రేణులు కూడా విమ‌ర్శిస్తున్నాయి. తాజాగా మ‌రోసారి మిగిలిన పోయిన వివిధ స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎస్ఈసీ ముందుకు రావ‌డాన్ని స్వాగ‌తించ‌డానికి బ‌దులు … ఓట‌మికి సాకులు వెత‌క‌డం టీడీపీకే చెల్లింది. 

ప్ర‌స్తుతం ఎస్ఈసీపై చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని చూస్తే మ‌రోసారి ఎన్నిక‌ల నుంచి పారిపోయేందుకు వాద‌న‌ను సిద్ధం చేసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే బాబు రాజ‌కీయ వ్యూహాలు తెలిసిన వారెవ‌రికైనా ఆయ‌న మాట‌ల ఆంత‌ర్యం ఏంట‌నేది బోధ ప‌డుతోంది.

ఈ సారైనా పకడ్బందీగా ఎన్నికలు జరగాలని ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించార‌ని బాబు చెప్ప‌డం ద్వారా ఆయ‌న ఏ విధంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకోవాల‌ని కుట్ర‌లు చేస్తున్నారో జ‌నానికి అర్థ‌మ‌వుతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడూ, లేన‌ప్పుడూ ఓట‌మి భ‌యంతోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకున్న‌, అడ్డుకుంటున్న ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కేలా ఉంది. చూద్దాం మున్ముందు ఏం జ‌రుగుతుందో!