రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి. అవి చాలా సార్లు ఎత్తులుగా ఉంటాయి. అవతల ప్రత్యర్ధి ఇద్దరికీ ఉమ్మడి శత్రువు అయినపుడు ఆటోమేటిక్ గా పొత్తులు కుదిరిపోతాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎపుడూ మిగిలిన ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుంది.
ఏపీలో చూసుకుంటే వైసీపీ విపక్షంలో ఉన్నా కూడా టీడీపీకీ, జనసేనకు టార్గెట్ అయింది. మరి ఇపుడు అదే పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు ఈ రెండు పార్టీల లక్ష్యం కాదూ. అంటే ఇది వెరీ సింపుల్ ఆన్సరే. అందుకే టీడీపీ జనసేనల మధ్య పోత్తు గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
అది రాజకీయ విశ్లేషణలలోనూ, ఇతర చర్చల్లోనూ ఎక్కువగా వస్తోంది. మరి నిజానికి ఆ పార్టీలలో కూడా చర్చ సాగుతోందా అంటే దాని మీద మాజీ మంత్రి అయ్యనంపాత్రుడు ఆన్సర్ ఇదే. పై స్థాయిలో చూస్తే జనసేనతో పొత్తు గురించి చర్చ ఎంతవరకూ ఉందో తెలియదు కానీ దిగువ స్థాయిలో అంటే క్యాడర్ లెవెల్ లో మాత్రం రెండు పార్టీలు కలవాలని బాగా కోరుకుంటున్నారు అని కొత్త విషయం బయటపెట్టారు.
సాధారణంగా పార్టీలు పొత్తులు కుదురుస్తాయి. క్యాడర్ మాత్రం అనుసరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తుంది. కానీ జనసేన, టీడీపీ క్యాడర్ మాత్రం లీడర్ల కంటే కూడా ముందుగానే ఈ పొత్తులను ఖరారు చేస్తోంది అని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. మరి అది ఆయన అంచనా కావచ్చు, అయితే దీనికి మించి టీడీపీలో కూడా చర్చ సాగుతోంది అన్నది మరో ప్రచారం.
అదే అయితే జనసేనలో కూడా ఇలాంటి విషయాలు ప్రస్తావనకు రాకుండా ఉంటాయా. అంటే క్యాడర్ కోరుకుంటోంది అని చెప్పినా రేపు ఈ రెండు పార్టీలు కలిసేందుకు అన్ని ద్వారములూ తెరచే ఉన్నవి అని చెప్పుకోవడానికే ఇదంతా అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఈసారి క్యాడర్ పొత్తులను డిసైడ్ చేస్తే లీడర్స్ అనుసరిస్తారా లేదా అన్నది.