Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: మంచి రోజులు వచ్చాయి

మూవీ రివ్యూ: మంచి రోజులు వచ్చాయి

టైటిల్: మంచి రోజులు వచ్చాయి
రేటింగ్: 2.25/5
తారాగణం: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
కూర్పు: ఎస్.బి.ఉద్దవ్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
కథ-దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 4 నవంబర్ 2021

"ఏక్ మిని కథ" హీరో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా "మంచి రోజులు వచ్చాయి" అనే టైటిల్ తో మారుతి దర్శకత్వంలో సినిమా అనగానే కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దీపావళి రోజున ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలవబోతోందనే సంకేతాలు కలిగాయి.

మారుతి రాసుకున్న కథల్లో "భలె భలే మగాడివోయ్" హీరోకి మతిమరుపు జబ్బు. "మహానుభావుడు" లో హీరోకి ఓసీడి జబ్బు. "బ్రాండ్ బాబు" లో హీరోకి బ్రాండ్ పిచ్చి. అలా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారికి భయపడే జబ్బు.

అయ్యిందానికీ కాని దానికీ భయపడే రోగమున్న హీరోయిన్ తండ్రిని ఇద్దరు పొరుగింటి మనుషులు చీటికీమాటికీ భయపెట్టి శాడిజం తీర్చుకుంటూ ఉంటారు. చివర్లో అతని రోగాన్ని కుదిర్చి హీరోగారు ఎలా ధైర్యాన్ని కలిగిస్తాడు అనేది కథ.

కథ సింగిల్ లైన్లో ఇదే అయినా అక్కడక్కడే, ఉన్న లోకేషన్సులోనే, పొడవాటి సీన్స్ తో కథనం నడుస్తుంటుంది. మొదలైన కొంచెం సేపటికే ఒక ధారావాహిక కార్యక్రమం చూస్తున్న ఫీలింగొస్తుంది.

కథనం ఎక్కడ మొదలై ఎటు వెళ్తోందో, ఎక్కడ రూటు మార్చి ఏ దిక్కున ఆగుతుందో అర్థం కాదు. పాత్రలు ఉంటాయిగానీ ఆయా పాత్రలకి ఆయా స్వభావాలు ఎందుకున్నాయో రీజనింగ్ ఉండదు.

ద్వితీయార్థంలో కథ పొడిగించడానికి పెట్టిన కరోనా ట్రాక్ చాలా ఇన్సెన్సిబుల్ గా ఉంది. ఎన్నో కుటుంబాల్ని పొట్టనపెట్టుకుని, ఎందరికో విషాదాన్ని మిగిల్చిన కరోనాని కామెడీకి వాడుకోవడం సమంజసంగా అనిపించదు.

లాజిక్ అడక్కుండా ఏదో వెకిలి కామెడీని చూస్తున్నట్టు చూసెయ్యాలి. అందులోనే అప్పుడప్పుడు సెంటిమెంటు లాంటివి పిండే ప్రయత్నం కూడా జరిగింది. అది కూడా భరించేయాలి.

ఎప్పుడో పదేళ్ల క్రితం "ఈ రోజుల్లో", "బస్ స్టాప్" లాంటి సినిమాలు మారుతి దర్శకత్వంలో వచ్చాయి. వాటి మీద ఒక వర్గం ప్రేక్షకులు "ఇవేమి బూతులురా బాబూ" అని అక్షంతలు వేసారు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టి కలెక్షన్సిచ్చారు.

కానీ ఆ సినిమాల్లో ఏముందో విషయం తెలియడం వల్ల కొంత, మారుతికి అప్పటికింకా ఇమేజ్ లేకపోవడం వల్ల కొంత ఆ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారు.

కాలక్రమంలో మారుతి పద్ధతి మార్చుకుని క్లీన్ కామెడీలు చేయడంతో ఆయన కెరీర్ కి మంచి రోజులు వచ్చాయి. మారుతి అనగానే కొన్ని అంచనాలతో సినిమాహాలుకొచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. కానీ ఎందుకో...మళ్లీ పదేళ్ల వెనక్కి తీసుకెళ్లి "మంచి రోజులు వచ్చాయి" టైటిలుతో ఆ పాత సి-గ్రేడ్ రకం సినిమాలని గుర్తు చేసారు.  

అసలిది నిజంగా మారుతి తీసిందేనా లేక ఆయన క్యాంపులో మరెవరైనా తీసారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మారుతి ఇలాంటి స్థాయి సినిమా చెయ్యలేదు.

కథ గానీ, కథాగమనం గానీ పెద్దగా ఆకట్టుకోవు. "ఇంజిన్ వీకు", "నా హార్స్ పవర్ ఆమె కెపాసిటీకి సరిపోదు", "వాడిది లేవదు", "అబ్బా ఏదొ పని చేస్తున్నట్టు"...ఇలా డైరెక్టుగా బూతర్థాల డయలాగులు రాసుకుని ఆ స్థాయి ప్రేక్షకులకి మాత్రమే నచ్చేలా తీసిన సినిమా ఇది.

సంతోష్ శోభన్ నటనలో ఈజ్ బాగానే ఉంది. కానీ ఆకట్టుకునే ప్రత్యేకమైన అంశాలేవీ లేవు. మెహ్రీన్ బాగా సన్నబడి మునుపటికంటే నాజూగ్గా ఉంది. నటించడానికి మాత్రం పెద్దగా స్కోపేమీ లేదు.

కథంతా తానే నిండిపోయి నటించిన అజయ్ ఘోష్ మాత్రం మెప్పించాడు. రజిత కూడా కొన్ని సీన్సులో కామెడీ పలికించింది.

వెన్నెల కిషోర్ అస్సలు నవ్వించలేకపోయాడు. అప్పడాల విజయలక్ష్మిగా ప్రవీణ్ చేసే కామెడీ నవ్విస్తుంది. సప్తగిరి ఇర్రిటేట్ చేసాడు. పొరుగింటి అంకుల్స్ గా కనపడిన ఇద్దరు నటులూ విసిగిస్తారు.

పేరున్న కమెడియన్స్ ని పెట్టుకున్నప్పుడు వాళ్ల కోసం సెపెరేట్ ట్రాక్స్ రాయించుకుని దిగుండాలి. కుదరని పక్షంలో వాళ్లని పెటకుండా ఉండాలి. లేకపోతే తెర మీద నచ్చిన కమెడియన్ కనపడగానే అంచనాలు పెట్టుకునే ప్రేక్షకులు నిరాశ చెందుతారు.

సంగీతం ఉన్నంతలో ఓకే. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. కెమెరా, ఎడిటింగ్ పర్వాలేదు.

టైటిల్ తో "ప్రతి రోజూ పండగే" లాంటి సినిమాలా ఉంటుందేమో అనే భ్రమ కలిపించి 'యూ(బూ)త్ కామెడీ' చూపించారు.

నీట్ ఫ్యామిలీ కామెడీ అనుకుని హాలుకెళ్తే మాత్రం ఒక వర్గం ఫ్యామిలీ ఆడియన్స్ చిరాకు పడే అవకాశం ఉంది. బూతు కామెడీకి నవ్వుకుంటూ సహజత్వానికి దూరంగా ఉండే సన్నివేశాలు చూస్తూ ఆనందం పొందగిలిగేవారికి మాత్రం నచ్చొచ్చు.

బాటం లైన్: రాలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?