కొందరు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు ఉనికి సమస్య ఏర్పడింది. ఇలాంటి వాళ్లందరికీ జగన్ను తిడితే తప్ప ఎవరూ పట్టించుకోని దయనీయ స్థితి. స్నేహితుడి కుమారుడనే కనీస స్పృహ, తండ్రి సమాన వయసులో ఉన్న తాను జగన్పై నోరు పారేసుకోవడం సబబు కాదనే ఇంగితం ఆ నాయకుడిలో కొరవడింది. కొంత కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి నోరు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే.
వైసీపీలో తాను ఉంటున్నందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అనడం తెలిసిందే. అసలు ఆయన తమ పార్టీలో ఉన్నారని అనుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెంప ఛెళ్లుమనేలా సమాధానం ఇచ్చారు. అప్పటికీ ఆయనకు జ్ఞానోదయం కానట్టుంది. ఉచిత ప్రచారం పొందాలంటే జగన్పై ఏదో ఒక విమర్శ చేస్తే, ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుందని ఆయన గ్రహించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి జగన్పై డీఎల్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరో జగన్కు తెలుసని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ అన్ని విషయాలు చెబితే మంచిపేరు వస్తుందని శుద్ధులు చెప్పడం గమనార్హం. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారని ఆయన ఆరోపించారు. జగన్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు.
జగన్పై విమర్శలు చేస్తే… చంద్రబాబు పిలిచి మైదుకూరు టికెట్ ఇస్తారని డీఎల్ అనుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో ఆయన మైదుకూరు ఎమ్మెల్యేగా చివరి సారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ను ఏ పార్టీ పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలం పాటు మైదుకూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన తనను పట్టించుకునే దిక్కులేకపోవడంతో మతిస్థిమితం కోల్పోయిన వారిలో అవాకులు చెవాకులు పేలుతున్నాడని వైసీపీ నేతలు విమర్శిస్తుండడం గమనార్హం.