రోడ్ల మీద, ఇరుకు సందుల్లో పెద్దపెద్ద రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించి.. ప్రజల ప్రాణాలను చంద్రబాబునాయుడు బలితీసుకున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెం.1 తీసుకు వచ్చింది. రోడ్లమీద సభలు నిర్వహించడాన్ని నిషేధించింది. దీని మీద ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయం ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అని వాళ్లు గోలపెట్టడం వరకు ఓకే. అందులో నిజం లేదని ప్రజలు కూడా గుర్తిస్తారు.
ఎందుకంటే.. ప్రభుత్వం సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పడం లేదు.. ముందుగా ఎంపిక చేసిన మైదానాలు, ఇతర విశాలమైన ప్రదేశాల్లో పెట్టుకోవచ్చునని చెబుతోంది. కాబట్టి ప్రతిపక్షాల గోలకు విలువ లేదు. కానీ మధ్యలో ఇంకో రచ్చ మొదలెడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం రోడ్ల మీద భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. వారికో రూల్సు, మాకో రూల్సా.. అంటూ నానా యాగీ చేస్తున్నారు. సహజంగానే వీరి అబద్ధపు కారుకూతలకు పచ్చమీడియా కూడా తోడవుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిది చిన్న ఊరేగింపు జరిగితే చాలు.. దానికి రాష్ట్రవ్యాప్త కవరేజీ ఇస్తోంది. నిబంధనల్ని పాటించడం లేదంటూ యాగీ చేస్తోంది. కానీ, వీళ్లంతా కూడా అబద్ధపు రాతలను ప్రచారంలో పెడుతూ గోల చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే.. జీవో నెం.1 అనేది కేవలం సభలు, సమావేశాలను మాత్రమే నిషేధిస్తోంది. రోడ్డు మీద పాదయాత్రగా వెళితే.. ఆ జీవో అడ్డంకులు సృష్టించదు. ఆ క్లారిటీ ఉన్నప్పటికీ.. కావాలని వైసీపీ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి వస్తే.. కుప్పంలో కూడా చంద్రబాబునాయుడు రోడ్డు షోల పేరిట ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదనే సభలు, సమావేశాలు పెట్టడానికి పోలీసులు అభ్యంతరం చెప్పారే తప్ప.. రోడ్డు మీద ఆయన పాదయాత్రగా నడిచివెళ్లినా కూడా అడ్డుకోలేదు. రోడ్డు మీద సాగిపోతే తప్పు కాదు.కానీ.. ఆగి మైకులు పెట్టుకుని.. జనాన్ని పోగేసి సభ తరహాలో ప్రసంగాలు చేయాలంటేనే తప్పు.
నందిగామ మార్కెట్ యార్డు పదవీస్వీకార సందర్భంగా గానీ, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ‘గడపగడపకు’ కార్యక్రమానికి వందరోజులుపూర్తి చేసిన సందర్భంగా గానీ.. నిర్వహించిన ఊరేగింపులు కేవలం రోడ్డమ్మట సాగిపోయాయంతే. సభలు జరగలేదు. సమావేశాలు నిర్వహించలేదు. ఇలా సభ, మైకులు ప్రసంగాలు లేకుండా సాగిపోతే విపక్ష కార్యక్రమాలకు కూడా అడ్డుండదు. కానీ.. జీవోనెం.1 పేరుతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చమీడియా అబద్ధపు రాతలతో చెలరేగుతున్నట్టుగా కనిపిస్తోంది.