కొన్ని నెలలైనా గడవలేదు.. భారత రాష్ట్ర సమితి ప్రస్థానంలో అప్పుడే రాజీ పడుతున్నారా? దేశవ్యాప్తంగా గులాబీజెండా హవా చూపించి.. ఎర్రకోటపై కూడా ఎగరేస్తామని ప్రకటించిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయి. భారాస ఆవిర్భావం రోజున ఆయన ప్రకటించిన స్వప్నాలు ఒక తీరుగా ఉంటే.. తాజాగా ఆయన కేబినెట్ లోనొ మంత్రి చెబుతున్న మాటలు.. ఆ కలలను తుస్సుమనిపించేలా ఉన్నాయి.
కేసీఆర్ భారాసను ప్రారంభించినప్పుడు.. దేశంలో అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ పోటీచేస్తుందని ప్రకటించారు. భారాస మొదటి ప్రయత్నంగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని ఆయన ఆరోజు వెల్లడించారు. తెలంగాణకు సరిహద్దుల్లో అనేక కర్ణాటక ప్రాంతాలు ఉండడంతో పాటు, అక్కడ తెలుగువారి ప్రాబల్యం కూడా ఒక మోస్తరుగా ఉండే నేపథ్యంలో భారాస తెలంగాణేతర ప్రాంతాల్లో మొదటి ప్రయత్నంగా కర్ణాటకలోనే బరిలోకి దిగుతుందని అందరూ నమ్మారు. కర్నాటక ఎన్నికల్లో భారాస మొదటిసారిగా పోటీచేస్తుందని కేసీఆర్ చెప్పినప్పటికీ.. అటువైపు తొలినుంచి ఆయన జాతీయ పార్టీ ప్రయత్నాలకు తోడుగా ఉంటూ వస్తున్న జేడీఎస్ నాయకుడు కుమారస్వామి మాత్రం.. కర్ణాటకలో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారాస పోటీచేస్తుందని, గెలిస్తే, కర్నాటక అసెంబ్లీలో గులాబీ అస్తిత్వాన్ని చాటుకోవడం ద్వారా.. జాతీయ పార్టీగా తొలిఅడుగులు ప్రారంభిస్తుందని అంతా అనుకున్నారు. పోటీచేయని చోట్ల కుమారస్వామికి అనుకూలంగా కేసీఆర్ ప్రచారం చేస్తారని కూడా నమ్మారు. కానీ.. తాజాగా గులాబీ మంత్రి సత్యవతి రాథోడ్ మాటలను గమనిస్తే.. కేసీఆర్ మాటలన్నీ తుస్సు అని తేలిపోతోంది.
కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీచేయడం లేదని.. కేవలం కుమారస్వామి అనుకూల ప్రచారానికి మాత్రమే పరిమితం కాబోతున్నారని అర్థమవుతోంది. ఆమె కర్ణాటక కలబురిగిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..జెడీఎస్ కు అనుకూలంగా కర్నాటకలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని, కుమారస్వామిని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. అచ్చంగా ఇది కేసీఆర్ చెప్పిన మాటలకు విరుద్ధమైన ప్రకటన.
కేవలం కుమారస్వామి కోసం ప్రచారం చేయడానికి, ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే అయితే.. కేసీఆర్ అంత హడావుడి చేసి జాతీయ పార్టీ పెట్టడం ఎందుకు? నేరుగా వెళ్లి ప్రచారం చేసినా సరిపోతుంది కదా.. అనేది పలువురి అభిప్రాయం. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనే పోటీచేయలేకపోతే.. ఇక ఇతర ప్రాంతాల్లో పోటీచేయడమూ, నెగ్గడమూ ఎర్రకోట మీద గులాబీజెండా రెపరెపలాడించడమూ.. ఇవన్నీ ఎప్పటికి సాధ్యమయ్యేను అని జనం నవ్వుకుంటున్నారు.