కాసేపట్లో దత్త తండ్రిని దత్త పుత్రుడు కలవనున్నారు. ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దగ్గరగా చూస్తున్న వాళ్లకి దత్త పుత్రుడు, దత్త తండ్రి అని ముఖ్య మంత్రి వైఎస్ జగన్ దెప్పి పొడుస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దత్త తండ్రి చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్ అని వైసీపీ అధినేత మొదలుకుని ఆ పార్టీ నేతలు ముద్దుగా విమర్శిస్తుంటారు.
వీకెండ్స్ పాలిటిక్స్ మాత్రమే చేసే పవన్‌కల్యాణ్ ఇవాళ చంద్రబాబును కలవడానికి నిర్ణయించుకున్నారు. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై పవన్‌కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను జీవో నంబర్-1ను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది,
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావంగా నిలిచేందుకు పవన్ ఆయన్ను కలవడానికి నిర్ణయించినట్టు తెలిసింది. ఆ మధ్య విశాఖలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత విజయవాడకు వెళ్లిన జనసేనానికి చంద్రబాబు నేరుగా వెళ్లి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రజావ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేస్తామని నాడు చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా ప్రకటించారు. నేడు వాళ్లిద్దరి భేటీకి జీవో నంబర్-1 కారణమైంది.
ఈ జీవోతో ప్రతిపక్షాల హక్కుల్ని కాలరాస్తున్నారనే విమర్శ బలంగా వుంది. నాడు తనకు అండగా నిలిచిన చంద్రబాబుకు మద్దతుగా నిలిచే అవకాశం దక్కిందనేది పవన్ భావన. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కాసేపట్లో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారనే సమాచారం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అవగాహనకు రావాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ, జనసేన నేతల అభిప్రాయం. ఇవాళ పొత్తుపై చర్చించే అవకాశాలున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాబు, పవన్ మధ్య ఇంత కాలం ఉన్న ముసుగు నేటితో తొలగనుందా? లేదా? అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.