అధికార పార్టీ వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా ఉద్యమం ప్రకటించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇతరత్రా పేర్లతో ప్రతిపక్షాలు ఏకమై వైసీపీని ఇరకాటంలో పడేసేందుకు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీపై భారీ కుట్రకు తెరలేపాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో క్రూర రాజకీయాలకు కూడా వెనుకాడడం లేదని విశ్వసనీయ సమాచారం.
ప్రతిపక్షాల కుట్రల లోతుల్లోకి వెళితే ….విస్తుపోయే వాస్తవాలు ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టికి వస్తున్నాయని తెలిసింది. ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుపై విష ప్రయోగం జరిగిందనే వార్త టీడీపీ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఈ ఘటన వెనుక టీడీపీ హస్తం వుందనే అనుమానాల్ని వైసీపీ వ్యక్తం చేయడం గమనార్హం.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీని భారీగా దెబ్బతీసే కుట్రకు టీడీపీ తెరలేపినట్టు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో బలమైన పట్టు వుంది. అలాగే టీడీపీకి బలమైన పట్టు ఉన్న బీసీల్లో భారీ చీలిక తెచ్చింది. ఇప్పుడు బీసీల్లో కూడా వైసీపీకి తిరుగులేని పట్టు వుండడతోనే 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లను గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో వైసీపీకి పట్టున్న సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ కుట్రపూరిత అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్టు తెలిసింది.
ఈ క్రమంలో తమకు అనుకూలమైన దళిత, మైనార్టీ, బీసీ నేతలను అంతమొందించేందుకు కూడా టీడీపీ వెనుకాడడం లేదని సమాచారం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కొలకపూడి శ్రీనివాసరావుపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలకపూడి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తద్వారా అతను టీడీపీకి, ఎల్లో మీడియాకు దగ్గరి వాడయ్యారు. ఆయన్ను ఏ మాత్రం వైసీపీ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడు ఆయనపై వైసీపీ దాడి చేసేంత సంఘటనలేవీ జరగలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
కొలకపూడికి పులిహోర ఇచ్చి ఏదో చేయాలని వైసీపీ చేసిందంటే నమ్మశక్యంగా లేదనేది మెజార్టీ అభిప్రాయం. కొలకపూడి ఘటనతో టీడీపీ అనుకూల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారిని ఏమైనా చేసి, ఆ నింద సీఎం జగన్‌పై వేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలను అధికార పార్టీ ఛేదించాల్సి వుంది. అసలు తనను అంతమొందించే ఉద్దేశం ఎవరికి ఉందో కొలకపూడి మొదట తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి. అలాగే తోటి మిత్రులను ఆయన అప్రమత్తం చేయాల్సిన అవసరం వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.