ముగ్గురూ ముగ్గురే

కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందన్నది సామెత. తెలుగుదేశం పార్టీ, దాన్ని నమ్ముకుని, దాని అండతో ఎదిగిన ఓ సామాజిక వర్గం పరిస్థితి చూస్తుంటే ఇదే సామెత గుర్తుకు వస్తుంది. 80వ దశకం…

కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందన్నది సామెత. తెలుగుదేశం పార్టీ, దాన్ని నమ్ముకుని, దాని అండతో ఎదిగిన ఓ సామాజిక వర్గం పరిస్థితి చూస్తుంటే ఇదే సామెత గుర్తుకు వస్తుంది. 80వ దశకం నుంచి ఉచ్ఛ స్థితిని అందుకుని, ఎన్టీఆర్ అండతో అస్సలు ఆ సామాజిక వర్గం అంటే ఏమిటో తెలియని చోట్ల కూడా ఎమ్మెల్యే టికెట్ లు అందిపచ్చుకుని, పునాదులు వేసుకుని ఎదిగిన వర్గం ఇప్పుడు కిందా మీదా అవుతోంది.

ఆ వర్గాన్ని పెంచి పోషించి. ఆ వర్గాన్ని అన్ని వ్యవస్థల్లో బలంగా చొప్పించి, ఆ అండతో తాను ఇన్నాళ్లు అధికారం నిలబెట్టుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒకేసారి అన్ని వైపులా ఏ అండా దొరక్క దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఆ ముగ్గురు…ఆ ముగ్గురే…పైగా ఆ ముగ్గురూ కూడా తెలుగుదేశం రాజకీయాన్ని చవిచూసిన వారు. తెలుగుదేశం చేతిలో దెబ్బతిన్నవారు… తెలుగుదేశం పార్టీ కారణంగా గా ఇబ్బందులు పడిన వారు.

ఆ ముగ్గురూ ఒకేసారి మూడు చోట్ల అధికారం అందుకోవడం, ఆ ముగ్గురూ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఆ పార్టీ నేత చంద్రబాబు తమ పట్ల వ్యవహరించిన తీరు మరిచిపోకపోవడం. కేవలం చంద్రబాబు చేసిన రాజకీయ తప్పిదాల కారణంగా, ఆ పార్టీకి వెన్నుముకగా మిగిలిన సామాజిక వర్గం ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది.

ఆ ముగ్గురు…..మోడీ…కేసిఆర్..వైఎస్ జగన్.

వాడుకుని వదిలేసి

చంద్రబాబుకు వున్న వాడుకుని వదిలేసే పాలసీనే కొంప ముంచింది. ఆది నుంచీ పార్టీలో కాస్త సరుకు వున్న నేతలు ఎవరు కనిపించినా, మెల్లగా పొగపెట్టి బయటకు పంపడం అన్నది ఆయనకు అలవాటు. పర్వతనేని ఉపేంద్ర దగ్గర నుంచి రేణుక చౌదరి, జయప్రద వరకు అనేక మంది ఈ పాలసీ కారణంగా ఇబ్బందులు పడి పార్టీని వీడిన వారే. అంతెందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే వున్నా నన్నపనేని రాజకుమారి సైతం బాబు కారణంగా ఇబ్బందులు పడి పార్టీ వీడి బయటకు వచ్చి కన్నీరు పెట్టిన వారే.

అయితే బాబు పాలసీ కారణంగా కావచ్చు, లేదా బాబు రాజకీయాల కారణంగా కావచ్చు, ఇబ్బంది పడినవారు చాలా మంది అలా అణగారిపోయారు. కానీ బౌన్స్ బ్యాక్ అయిన వారు కొద్ది మందే. అలాంటి కొద్ది మందిలో ఈ ముగ్గురూ వున్నారు. మోడీ, జగన్ ఇద్దరూ బాబు రాజకీయాల దెబ్బతిన్న పులులు. కేసిఆర్ మాత్రం బాబు పొగపెట్టి బయటకు సాగనంపిన నాయకుడు.

ఇలాంటి ముగ్గురూ ఒకేసారి మూడు కీలక స్థానాలకు చేరుకోవడం అన్నది తెలుగుదేశం పార్టీ పట్ల, దాన్ని నమ్ముకున్న సామాజిక వర్గం పట్ల విధి ఆడిన వింత నాటకం అనుకోవాలి. ఒక చోట కాకుంటే ఒక చోట అయినా కాస్త కాలూనే అవకాశం లేకుండాపోయింది,. గతంలో ఎప్పుడూ ఇలా లేదు.

ఎవరున్నా సరే..

గతంలో ఎక్కడ ఏ ప్రభుత్వం వున్నా, ఆ వర్గం పనులు సజావుగా సాగిపోయేవి. సామ, దాన, దండ, బేధోపాయాలు వాడేసేవారు. పని జరిగిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఆ ముగ్గురూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ వర్గం పట్ల కినుకగా వున్నారు. మోడీకి ఆ వర్గానికి చెందిన చంద్రబాబు కిట్టడం లేదు. కెసిఆర్ కు కొంత వరకు ఆ వర్గం,  మరి కొంత వరకు చంద్రబాబు నచ్చడం లేదు. జగన్ కు అయితే అసలు ఆ వర్గం తనకు చేసిన అన్యాయం, తనను పెట్టిన బాధలు తలుచుకుని, అస్సలు నిద్రేపట్టడం లేదు. అందువల్లే ఒకేసారి ముగ్గురూ ఒకే తరహా భావనతో వుండడం వల్ల, ఒక చోట కాకపోతే మరో చోట అయినా పని జరుగుతుందనే ఆశలు అడుగంటిపోతున్నాయి. అసలు ఎందుకిలాంటి పరిస్థితి వచ్చింది?

మోడీతో ముడి

చంద్రబాబు దార్శనికుడు. విజన్ 2020 అనే పద సృష్టి కర్త. కానీ అంతటి దార్శనికుడు కూడా మోడీని రెండు సార్లు తక్కువ అంచనా వేసారు. ఒక సారి తొందరపడి మాట జారీ, మోడీ కనుక హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తా అన్నారు. కానీ అంతలోనే పాపం 2014లో మోడీ అవసరం వచ్చింది.  మోడీని ఎలా, ఎవరి సాయంతో, ఎక్కడ, ఎప్పుడు పట్టుకున్నారో కానీ మొత్తానికి పొత్తు సంపాదించారు. గెలిచారు. రెండు మంత్రి పదవులు సంపాదించారు. తాను అనుకున్న అమరావతిని రాజధాని చేసారు. అన్నీ చేసి తీరా 2019 దగ్గరకు వచ్చేసరికి..' నీకూ బెబ్బే..నీ అబ్బకీ బెబ్బే' అన్న సామెత మాదిరిగా చేసారు.

తన రాష్ట్రం, తన పార్టీ, తన అధికారం అన్నీ గాలికి వదిలి, దేశం అంతా శివమెత్తినట్లు తిరిగేసారు. ఆ పూనకంలో మోడీని చంద్రబాబు అన్న మాటలు ఇన్నీ అన్నీ కావు. చేసిన విమర్శలు బోలెడన్ని.  ఇక మోడీ అధికారంలోకి రారేమో అన్నంతగా బాబు నాయుడు ఆయన మీడియా జనాల్ని భ్రమలోకి తీసుకెళ్లిపోయారు.

అదిగో అక్కడ సరిగ్గా విధి వక్రించింది. మోడీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. బాబు కోసం భాజపాలో కోవర్టులుగా పని చేసేవారిని తెలివిగా పక్కన పెట్టారు. బాబు అంటే అరికాలి మీద లేవకపోయినా, అంతగా గిట్టని వారిని ముందుకు తెచ్చారు.

కేసిఆర్ తో తకరారు

కేసిఆర్ తో చంద్రబాబు అవినాభావ సంబంధం. కేసిఆర్ పాపం, తెలుగుదేశం మనిషే. కానీ కెసిఆర్ పంతం, స్టామినా తెలియక చంద్రబాబు మెల్లగా పొగపెట్టి బయటకు పంపారు. కానీ కేసిఆర్ బాబు కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. అందుకే తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకుని ముందుకు సాగి అధికారం సాధించారు. ఈ క్రమంలో మళ్లీ బాబును ఓ సారి నమ్మారు. మళ్లీ వదిలారు.

ఇలాంటి టైమ్ లో 2014 ఎన్నికలు వచ్చాయి. మళ్లీ బాబుగారు తన విశ్వరూపం చూపించారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వగైరా ఆంధ్ర జనాలు వున్న ప్రాంతాల్లో ఓ లెక్కలో హల్ చల్ చేసారు. తెలుగుదేశం సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి మరీ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఇక కేసిఆర్ ఇంటికే వెళ్లిపోతారని బాబునాయుడు గారు భ్రమించారు.

కానీ మళ్లీ ఇక్కడా విధి వెక్కిరించింది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అయింది. ఓటుకు నోటు వ్యవహారానికి పగ తీర్చుకుందాం అనుకుంటే కేసిఆర్ మరింత పగపట్టేటట్టు అయిపోయింది. ఇక చీమ కూడా దూరనంతగా బాబుకు కేసిఆర్ కు మధ్య ద్వారాలు మూసుకుపోయాయి. ఈ సామాజిక వర్గ వైనం అంతే. అస్సలు నమ్మడానికి లేదు అని కేసిఆర్ అనుకునేలా చేసారు బాబు

జగన్ తో జన్మ వైరం

తెలుగుదేశం పార్టీ, ఆ సామాజిక వర్గం ఎలాంటివి అన్నది వైఎస్ జగన్ కు అనుభవం అయినంతగా మరెవరికీ అనుభవంలోకి వచ్చి వుండవు. నిజానికి నందమూరి బాలకృష్ణ వ్యవహారం వైఎస్ హయాంలో కాబట్టి అలా సమసిపోయింది. ఓ ఇంట్లో తుపాకి కాల్పులు జరిగితే, ఆ ఇంటి మనుషులు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కకుండా, కసికందకుండా, వసివాడకుండా కేసు లేకుండా కావడం అంటే వైఎస్ ఘనత అని అనుకోకతప్పదు. రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య వర్గాల్లో కూడా వున్న అభిప్రాయం ఇదే.

అలాగే వైఎస్ హయాంలో జగన్ చుట్టూ వున్నది తెలుగుదేశం అనుకూల సామాజక వర్గమే. ఆ వర్గపు వ్యాపారజనమే. ప్రయోజనం పొందిందీ  వారే. కానీ జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా సర్వ శక్తులు అడ్డం వేసింది ఆ వర్గమే. జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ లో ఆ వర్గపు మీడియా చేసిన యాగీ ఇంతా అంతా కాదు. జగన్ ముఖ్యమంత్రి కాకూండా చూడడం కోసం ఆ వర్గం ఎంత చేయాలో అంతా చేసింది. వారి అదృష్టం బాగుంది. 2014లో జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు.

అదే విధంగా జగన్ పై కేసులు పెట్టించడం లో కానీ లోపల వేయించడంలో కానీ ఆ సామాజిక వర్గ కృషి ఎంత వుందన్నది జనానికి తెలియని రహస్యం కాదు. అందుకే జగన్ కు అంతకు అంతా కసి పెరిగింది. అలాంటి కసి పెట్టుకున్న జగన్ సిఎమ్ అయితే ఎంత కష్టమో తెలుగుదేశం పార్టీకి, దాని పునాదుల్లో వున్న ఆ వర్గానికి బాగా తెలుసు. అందుకే ఎన్ని యుక్తులు పన్నాలో అన్నీ పన్నారు. జనసేనను ఎంత వాడాలో అంతా వాడారు. ఎన్ని వార్తలు వండాలో అన్నీ వండారు.

కానీ విధి కరుణించలేదు. జగన్ నే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు దారుణపరాజయం పాలయ్యారు.

ఇప్పుడు ఆ ముగ్గురి వంతు

తెలుగుదేశం పార్టీ, దాని నేత చంద్రబాబు, దాని మద్దతు సామాజిక వర్గం వైఖరి ఎలా వుంటుందో మోడీ, కేసిఆర్, జగన్ త్రయానికి బాగా అంటే బాగా అర్థం అయిపోయింది. ఒకసారి మోసపోతే మన తప్పు. రెండోసారి మోసపోతే అవతలివాడి తెలివి. పదే పదే మోసపోతే మనం వెధవాయిలం అవుతాము అనే నానుడి ప్రకారం, ఇక పదే పదే మోసపోవడానికి ఈ ముగ్గురు సిద్దంగా లేరు. అందుకే బాబు తరపున పలువురు ఆయన సామాజిక వర్గ జనాలు అర్జెంట్ గా పార్టీ ఫిరాయించి, భాజపాలోకి జంప్ చేసినా, వారిని ఎక్కడ వుంచాలో అక్కడే వుంచారు.  అంతే కాదు తేదేపాకు వంత పాడుతున్న భాజపా జనాలను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసారు.

కేంద్ర స్థాయిలో చూస్తే మాట చెల్లడం లేదు. మోడీ దగ్గరకు రానివ్వడం లేదు. తెలంగాణలో చూస్తే మన బతుకు మనం బతికే వరకు ఓకె. తోక జాడిస్తే కట్ చేయడానికి కేసిఆర్ కు రెండు క్షణాలు పట్టదు. హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు తలుపులు తీసి ఎన్నాళ్లయిందో? ఇక  ఆంధ్రలో అయితే జగన్ ఏకంగా చెడుగుడు ఆడేస్తున్నారు.

కరోనా కాటు

ఇలా కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో విధి వక్రించి తెలుగుదేశం అనుకూలం సామాజిక వర్గం డీలా పడిపోతే, కరోనా అన్నది ఉరుములేని పిడుగులా వచ్చి పడింది. ఆ వర్గం వ్యాపార మూలాలు మొత్తం దారుణంగా దెబ్బ తీస్తోంది. హోటల్, రెస్టారెంట్లు, ప్రయివేటు రవాణా, మీడియా, సినిమా, మైనింగ్ ఇలాంటి అన్ని రంగాల్లో భయంకరంగా సంపాదిస్తున్న ఆ వర్గానికి పూర్తిగా చుక్క ఎదురైంది. వ్యాపారాలు కుదేలయ్యాయి. అప్రహతిహతంగా సాగుతున్న మీడియా కాస్తా మూలన పడే పరిస్థితి వచ్చింది.

నిజానికి ఇలాంటి టైమ్ లో చంద్రబాబు అధికారంలో వుంటే, ఓ లెక్కలో ఆదుకునేవారు. అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చి మీడియాను, రోజుకో సెమినార్ పెట్టి హోటల్ రంగాన్ని ఇలా రకరకాలుగా అడ్డదారుల్లో ఆదుకునే అవకాశం వుండేది. ఇప్పడు అవన్నీ లేకుండా పోయాయి. మైనింగ్ అక్రమాల్లో కోట్లకు కోట్లు దొడ్డి దారిలో సంపాదించిన వారి ఆగడాలకు అడ్డు కట్టపడింది.

అందుకే ఇదంతా

ఇక మిగిలిన ఆశ అంతా, జగన్ అనేవాడు అధికారంలో లేకుండా చేయాలి. వైకాపా పార్టీని కకావికలు చేయాలి. అది చేస్తే తప్ప తెలుగునాట తెలుగుదేశం పార్టీ, దాని మద్దతు వర్గం బతికి బట్టకట్టడం అన్నది అసాధ్యం. అందుకోసం ఏం చేసినా ఫర్వాలేదు. ఎలా చేసినా ఫర్వాలేదు. అందుకే కోర్టులను అడ్డం పెట్టుకున్నారు. చీటికీ మాటికీ కోర్టులకు ఎక్కతున్నారు. తమ మీడియా ద్వారా వార్తలు రాయించడం, దాని ద్వారా కేసులు వేయించడం, మళ్లీ వార్తలు, మళ్లీ కేసులు. ఇదీ వ్యవహారం.

కానీ జగన్ అనేవాడు అంత సులువుగా దిగి వచ్చేవాడు కాదు. అధికారం పోయినా, ఇంకేం పోయినా కూడా ఈ వర్గానికి లొంగడు కాక లొంగడు. అది పక్కా. కేసిఆర్, జగన్, మోడీ త్రయం కలిసి 2024లో తెలుగుదేశం పార్టీని అధికారానికి దూరం చేయగలిగితే, ఇక మిగిలినదంతా చరిత్రే అవుతుంది. వర్తమాన పరిస్థితులు గమనిస్తుంటే, జరిగేది అదే అని స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్వీ