సీనియర్ హీరోయిన్లు గ్యాప్ తీసుకొని తల్లి-వదిన పాత్రల్లోకి షిఫ్ట్ అయిపోతుంటారు. అక్కడ్నుంచి వాళ్ల కెరీర్ మరో విధంగా సాగిపోతుంది. క్రేజ్ లేకపోయినా క్యాష్ కు ఢోకా లేకుండా జరిగిపోతుంది. కానీ సీనియర్ హీరోయిన్ మీనాకు మాత్రం ఇలాంటివేం అక్కర్లేదంటోంది. నటిగా తృప్తి కావాలంటోంది.
“ప్రస్తుతం నేను నా కూతురికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. ఆమె నాకు సర్వస్వం. నాకు ఏదైనా సినిమా ఆఫర్ వస్తే, నా కూతుర్ని వదిలి సెట్స్ పైకి రావాలి అనిపించేలా ఆ పాత్ర ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమా చేస్తాను. మరీ ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరికితే చేయాలని ఉంది.”
ఇలా తన మనసులో మాట బయటపెట్టింది మీనా. అయితే సినిమాల్లోనే నటించాలనే రూల్ పెట్టుకోలేదంటోంది ఈ సీనియర్ నటి. మంచి క్యారెక్టర్ దొరికితే వెబ్ సిరీస్ అయినా చేస్తానంటోంది.
తెలుగు నుంచి తనకు పెద్దగా ఆఫర్లు రావడం లేదని ఒప్పుకున్న మీనా.. ప్రస్తుతం తమిళ్ లో రజనీకాంత్ సరసన ఓ మూవీ, మలయాళంలో దృశ్యం-2 సినిమాలు చేస్తోంది. అన్నట్టు జీ5కు తమిళ్ లో ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది ఈ నటి.