సాక్షిలో ఏబీకే ఆర్టిక‌ల్…రాయ‌డం ఓ సాహ‌స‌మే

సీనియ‌ర్ ఎడిట‌ర్ ఏబీకే ప్ర‌సాద్ గురించి తెలుగు జ‌ర్న‌లిజం రంగానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. నిఖార్సైన జ‌ర్న‌లిస్టు. ఆయ‌న క‌లం ప‌దును ఏంటో దెబ్బ‌తిన్న అక్ర‌మార్కుల‌ను అడిగితే చెబుతారు. వృద్ధాప్య ద‌శ‌లో కూడా ఇంకా…

సీనియ‌ర్ ఎడిట‌ర్ ఏబీకే ప్ర‌సాద్ గురించి తెలుగు జ‌ర్న‌లిజం రంగానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. నిఖార్సైన జ‌ర్న‌లిస్టు. ఆయ‌న క‌లం ప‌దును ఏంటో దెబ్బ‌తిన్న అక్ర‌మార్కుల‌ను అడిగితే చెబుతారు. వృద్ధాప్య ద‌శ‌లో కూడా ఇంకా చ‌దవ‌డం, రాయ‌డం కొన‌సాగిస్తుండ‌డం నిజంగా ఆశ్చ‌ర్యం, ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పాలి. గ‌తం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ కాలాల గురించి క్షుణ్ణంగా తెలిసిన తెలుగు జ‌ర్న‌లిస్టుల్లో ఏబీకే ప్ర‌థ‌మ వ‌రుస‌లో ఉంటారు. కేవ‌లం క‌లం యోధుడిగానే కాకుండా, వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న సోష‌ల్ యాక్టివిస్ట్‌. ఏ నిర్ణ‌యం వెనుక ఏ కుట్ర క‌థ ఉందో ఆయ‌న ఇట్టే చెప్పేస్తారు.

సాక్షి ఎడిట్ పేజీలో ‘రెండోమాట’ కాలం కింద‌ ‘బాబు కుట్ర పర్యవసానం ‘నాట్‌ బిఫోర్‌’ అనే శీర్షిక‌తో ఓ అద్భుత‌మైన ఆర్టిక‌ల్ రాశారు. నిజానికి ఇలాంటి ఆర్టిక‌ల్ రాయ‌డానికి స‌మాజాన్ని ప్రేమించే చిత్త‌శుద్ధి, దుర్మార్గాన్ని ద్వేషించే నిజాయితీ ఉండాలి. ఈ వ్యాసం చ‌దువుతుంటే ఏబీకేలోని ద‌మ్ము, ధైర్యం మ‌న ముందు ఆవిష్కృమ‌వుతాయి.

ప్ర‌తి అక్ష‌రం ఆత్మాభిమానంతో క‌దం తొక్క‌డాన్ని ద‌ర్శించ‌వ‌చ్చు. అలాగే ఎంతో సున్నిత‌మైన న్యాయ వ్య‌వ‌స్థపై ప్ర‌చురించిన సాక్షి ధైర్యం, సాహ‌సం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే మిగిలిన మీడియా సంస్థ‌ల‌కు, సాక్షికి ఎంతో తేడా ఉంది. మిగిలిన మీడియా సంస్థ‌లు కొన్ని పార్టీలు, కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నాయి. ఇదే సాక్షి విష‌యానికి వ‌స్తే త‌నే ఓ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌. ఈ చిన్న తేడాను గ‌మ‌నించాల్సి ఉంది.

ఇక క‌థ‌నంలోకి వెళితే…కొన్ని సంఘ‌ట‌న‌ల గురించి ఏబీకే చెబుతుంటే, ‘ఔనా ఔనా…ఇది నిజ‌మా’ అని ఆశ్చ‌ర్యంతో మ‌న‌కు మ‌నం ప్ర‌శ్నించుకుంటాం. ఉదాహ‌ర‌ణ‌కు ఈ వ్యాసంలోని ఈ వాక్యాల‌ను చ‌దివితే అస‌లు సంగ‌తేంటో తెలుస్తుంది.

‘నిజానికి రుక్మిణీ బాబ్డే రాజధాని రైతుల తరఫున హాజరైనట్టు ఎక్కడా రికార్డులో నమోదే కాలేదు. అలాగే హైకోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ జారీ అయిన ఉత్తర్వులో కూడా రుక్మిణీ బాబ్డే హాజరైనట్టు పేర్కొననే లేదు. అయినా సుప్రీం ముందు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కూతురు హోదాలో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్టు బాబు వర్గం బొంకే శారు. ఈ కుట్ర తెలియని జస్టిస్‌ బాబ్డే తన కూతురు రుక్మిణి హాజరైన కేసును తాను ‘విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని’ రాష్ట్ర ప్రభుత్వం(జగన్‌) పిటిషన్‌ను జస్టిస్‌ నారిమన్‌ బెంచికి పంపగా, తన తండ్రి ఫాలీ నారిమాన్‌కు ఈ కేసు గురించి ముందుగానే వివరించామన్న ‘హింట్‌’ బాబు వర్గీ యులు చెప్పడంతో జస్టిస్‌ నారిమన్‌ తాను విచారణ నుంచి తప్పు కున్నారు. అంటే నైతిక విలువలు గల జస్టిస్‌గా రోహింటన్‌ నారి మన్‌ను ఈ రూపేణా విచారణ నుంచి తప్పించే కుట్రకు పాల్పడ్డారని దాచినా దాగని సత్యంగా బయటపడింది’

దీన్నిబ‌ట్టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రోక్షంగా ఎంత కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారో ఏబీకే క‌ళ్ల‌కు క‌ట్టారు. ఏబీకే చెప్పేంద వ‌ర‌కు అస‌లు ఇలాంటి ప‌రిణామాలు కూడా చోటు చేసుకుంటాయా? అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బాబ్డే, మ‌రో న్యాయ‌మూర్తి నారిమ‌న్‌ల‌ను ఓ ప‌థ‌కం ప్ర‌కారం విచార‌ణ నుంచి త‌ప్పించార‌ని చెప్ప‌డానికి ఏబీకేకు ఎంత ధైర్యం?

అలాగే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీంకోర్టులో ఇద్ద‌రు పాత్రికేయుల‌తో క‌లిసి తాను వేసిన రిట్ పిటిష‌న్‌ను అస‌లు చూడ‌కుండానే అప్ప‌ట్లో ప‌క్క‌న ప‌డేశార‌నే నిజం విన‌డానికే ధైర్యం చాల‌దు. త‌న రిట్ పిటిష‌న్‌ను అడ్డుకోడానికి బాబు ఏం చేశాడో ఏబీకే చెప్పుకొచ్చారు.

అలాగే ర‌క‌ర‌కాల క్రీడ‌ల అభివృద్ధికి స్టేడియాలు నిర్మిస్తామంటూ ఐఎంజీ భార‌త అక‌డ‌మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బోగ‌స్ కంపెనీకి వెయ్యి ఎక‌రాల స్థ‌లాన్ని ఇవ్వ‌డంపై సీబీఐ విచార‌ణ కోసం విజ‌య‌మ్మ‌, విజ‌య‌సాయిరెడ్డి, తాను హైకోర్టును ఆశ్ర‌యిస్తే…చివ‌రికి ఏమీ కాలేద‌ని ఆయ‌న రాసుకొచ్చారు. చివ‌రికి దాన్ని న్యాయ‌స్థానంలో నాన‌బెడుతూ వ‌చ్చార‌ని, బాబుపై సీబీఐ విచార‌ణ‌కు సిబ్బంది కొర‌త ఏర్ప‌డుతుందని ఏబీకే ఓ నిట్టూర్పు విడిచారు.

రాజ‌ధానికి భూములు తీసుకునే క్ర‌మంలో  అమరావతి రైతాంగానికి జరిగిన నష్టం గురించి, అన్యాయాల గురించి రైతాంగం తరఫున హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి (ప్రస్తుతం లోకాయుక్త), మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌రావు, సీనియర్‌ న్యాయవాది సదాశివరెడ్డితో క‌లిసి తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (2015 సంవత్సరం ఏప్రిల్‌) గత ఆరేళ్లు గానూ విచారణకు రాకుండానే పోయింద‌నే ప‌చ్చి నిజాన్ని ఏబీకే ప్ర‌పంచానికి చాటి చెప్పి…వాస్త‌వాల్ని క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు.

కేసు విచార‌ణ‌కు రాక‌పోవ‌డానికి బాబు తాంత్రిక విద్య‌లే కార‌ణ‌మ‌ని ఏబీకే తెలిపారు. అలాగే హైకోర్టులో ఒక‌రిద్ద‌రి గురించి ఏబీకే చేసిన కామెంట్స్ తీవ్ర ప‌ద‌జాలంతో ఉన్నాయి. ఇలా అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఏబీకే వ్యాసం సాగింది. చివ‌రిగా ఇప్ప‌టికైనా న్యాయ వ్య‌వ‌స్థ‌లు అప్ర‌మ‌త్తం కావ‌డం ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి శ్రేయ‌స్క‌ర‌మ‌ని ఏబీకే  ఆకాంక్షించారు.

మ‌రీ ముఖ్యంగా త‌న వ్యాసాన్ని పులిట్జ‌ర్ అవార్డు గ్ర‌హీత జ‌డ్జిస్ గ్రంథ‌క‌ర్త డేవిడ్ పానిక్ చెప్పిన ఓ గొప్ప వాక్యంతో మొట‌లు పెట్ట‌డం విశేషం. ఆయ‌న చెప్ప‌బోయే విష‌యాల‌కు, ఆ మ‌హ‌నీయుడి అభిప్రాయాల ప్రాతిప‌దిక‌గా ఆలోచించాల‌నే ఉద్దేశం ఏబీకే రాత‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. బ్రిట‌న్ క్వీన్స్ కౌన్సిల్ స‌భ్యుడు, ప్ర‌సిద్ధ బారిస్ట‌ర్ అయిన డేవిడ్ పానిక్ చెప్పిన ఆ మాట‌లేంటో మ‌న‌మూ తెలుసుకుందాం.

‘న్యాయమూర్తులు సైతం తమ ఇతర సమకాలీనుల మాదిరే కోరికలకు, భావావేశాలకు, ఉద్రిక్తతలకు, భయాందోళనలకు లోన వుతూ ఉంటారు. మీరు మరీ గట్టిగా విమర్శిస్తే వారు బాధపడతారు. వారి వృత్తిలో వారి ప్రతిభా ప్రమాణాలు ఎంత ఉన్నతమైనవైనా, వారిలో కూడా మానవ బలహీనతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి’

అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున ఏబీకే వేసిన రెండు పిటిష‌న్లు ఎలాంటి విచార‌ణ‌కు రాక‌పోవ‌డం, అలాగే ఐఎంజీ భూముల పంప‌కాల‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్ట‌క‌పోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఎందుకు? అనే ప్ర‌శ్న‌ల‌కు త‌గిన స‌మాధానం డేవిడ్ పానిక్ చెప్పిన మాట‌ల్లో ఉంద‌ని ఏబీకే ఆలోచ‌నై ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి.

బాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు