ఇసుక కొరతపై ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అదే పనిగా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. కొరతకు సాంకేతిక సమస్యలు ఒక కారణమైతే, ప్రకృతి ప్రతికూలత కూడా మరో కారణం. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం అదంతా జగన్ సర్కార్ వైఫల్యం అన్నట్టు చిత్రీకరిస్తోంది. ప్రతిపక్షం సంగతి పక్కనపెడితే, జగన్ మాత్రం ఈ సమస్యపై సీరియస్ గా ఉన్నారు. అందుకే ఇసుక కొరతకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి.
ఉన్న రీచుల నుంచే అధిక మొత్తంలో ఇసుకను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు సీఎం. ఎక్కడైతే వరద ఉధృతి తక్కువగా ఉందో అక్కడ్నుంచి రెట్టింపు ఇసుకను వెలికితీయాలని చెప్పారు. దీంతో పాటు ఇసుకను అధిక ధరలకు విక్రయించకుండా ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు జగన్. అయితే చట్టం అమల్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి, ఈ గ్యాప్ లోనే దీనిపై ఆర్డినెన్స్ జారీచేయబోతున్నారు జగన్.
ఇకపై ఇసుకను బ్లాక్ చేసినా, అధిక ధరకు అమ్మినా, సరిహద్దులు దాటించినా నూతన ఆర్డినెన్స్ ద్వారా జైళ్లో పెడతారు. ఈ మేరకు మరో 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ రాబోతోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించిన తర్వాత, అదే ధరకు ఇసుకను అమ్మాలని.. నిబంధనల్ని అతిక్రమించిన వాళ్లను జైలుకు పంపాలని జగన్ ఆదేశించారు. ఈ మేరకు వినియోగదారులకు అందుబాటులో ఓ టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటుచేయాలని సూచించారు.
ఇసుక కొరతను అధిగమించేందుకు ఓవైపు ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ మరోవైపు ప్రకృతి మాత్రం సహకరించడం లేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయనగా, కొత్తగా మరో వాయుగుండం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తుపానుగా మారే ప్రమాదముందని, దీనివల్ల మరోసారి ఏపీ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు బుల్ బుల్ అని పేరుపెట్టారు.
ప్రస్తుతం 275 రీచ్ లకు గాను, 83 రీచుల నుంచి ఇసుకను తీస్తున్నారు. మొన్నటివరకు 61 రీచులు మాత్రమే పనిచేయగా.. తాజాగా మరికొన్ని అందుబాటులోకి రావడంతో సంఖ్య 83కు పెరిగింది. వచ్చే వారం నాటికి కనీసం 120 రీచుల్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. వాతావరణం సహకరిస్తే.. 2 వారాల్లో దాదాపు 90శాతం రీచుల్ని అందుబాటులోకి తెస్తామంటున్నారు. రీచులు అందుబాటులోకి వచ్చే సమయానికి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి, ఇసుక అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ పై కఠినంగా వ్యవహరించాలని జగన్ భావిస్తున్నారు.