కొత్త జిల్లాలు ఇప్పట్లో లేవా?

వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో కీలకమైన వాటిల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. ఇచ్చిన ప్రతి హామీని నిలెబట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాల ఏర్పాటుకు ఎప్పుడు శ్రీకారం చుడతారు అన్నది ఆసక్తికరమైన విషయం.…

వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో కీలకమైన వాటిల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. ఇచ్చిన ప్రతి హామీని నిలెబట్టుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాల ఏర్పాటుకు ఎప్పుడు శ్రీకారం చుడతారు అన్నది ఆసక్తికరమైన విషయం.

చాలా మంది కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు కూడా. ఎందుకంటే బిజినెస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా కొత్త జిల్లాల ఏర్పాటు చాలా మార్పులు తెస్తుంది. 

అయితే పరిస్థితులు గమనిస్తుంటే ఇప్పట్లో కొత్తజిల్లాల ఏర్పాటు వుండే అవకాశం కనిపించడం లేదు. ఇంతకు ముందు సమాచారం ప్రకారం రాబోయే జనవరి 26 కు కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలి. కానీ అలా జరుగుతుందా? అన్న అనుమానం వుంది.

ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అంటే చాలా కసరత్తు వుంటుంది. ప్రస్తుతం వున్న జిల్లాల విభజన అనేది చాలా కీలకం. 

రాజకీయ నాయకుల లెక్కలు, ప్రజల కోరిక, ప్రాంతాల మధ్య సమతూకం, జిల్లా కేంద్రంతో అనుసంధానం వంటి అనేక విషయాలు ఆలంబనగా చేసుకుని, విభజన చేయాల్సి వుంటుంది.

గతంలో మండల కేంద్రాలు ఏర్పాటుచేసిన తరువాత చాలా ఏళ్ల పాటు ఈ గ్రామాన్ని ఆ మండలంలో కలపడం, వంటి కార్యక్రమాలు జరపాల్సి వచ్చింది. జనాల ఆందోళన లు తప్పలేదు. కేవలం మండలాల ఏర్పాటు కే ఇంత జరిగితే జిల్లాల ఏర్పాటు అంటే ఇంకా జనాల పట్టింపులు చాలా వుంటాయి.

అదే కాక ఓ జిల్లాను రెండుగా, మూడుగా విడదీయడం అంటే తమాషా కాదు. దానికి ముందుగా ఓ కమిటీ అనేది వేసి, అది అన్ని జిల్లాలు పర్యటించి, కసరత్తుచేసి, ప్రజా ప్రతినిధులతో చర్చించి, అప్పుడు నివేదిక ఇవ్వాల్సి వుంటుంది. ఇదంతా టైమ్ పట్టే వ్యవహారం.

ఇదిలా వుంటే పంచాయతీ ఎన్నికల తరువాతే జిల్లాల విభజన అంటున్నారు మంత్రులు. అలా అయితే ఇంకా దూరం వుండొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుపుతారా? అన్నది అనుమానం.

అమ్మ ఒడి పథకం అమలు చేయడం, ఇసుక సమస్య పరిష్కరించడం వంటి ఒకటి రెండు కీలక విషయాలు పూర్తి అయిన తరువాత కానీ పంచాయతీ ఎన్నికలకు వెళ్లకపోవచ్చు.

అందువల్ల ఇప్పట్లో జిల్లాల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు. అయితే జగన్ ఈ హామీని విస్మరించరు. అది వాస్తవం. అయితే అది కార్యరూపం దాల్చడమే ఎప్పుడు అన్నది తెలియాల్సి వుంది.